కలవనని ట్విస్ట్!: అఖిలప్రియతో కలిసి సీఎంను కలిసిన భూమా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డిలు కలిశారు. మంగళవారం నాడు శిల్పా వర్గీయుడు తులసి రెడ్డి పైన దాడి నేపథ్యంలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తులసి రెడ్డి పైన దాడికి పాల్పడింది భూమా నాగిరెడ్డి అనుచరులేనని, ఈ దాడి వెనుక భూమా హస్తం కూడా ఉందని సొంత పార్టీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై భూమా నిన్న మాట్లాడుతూ.. తులసి రెడ్డిపై దాడితో తనకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ విషయమై తాను చంద్రబాబును కలవనని కూడా చెప్పారు. కానీ బుధవారం కూతురు అఖిల ప్రియతో కలిసి వచ్చి చంద్రబాబును కలిశారు.

భూమా మంగళవారం మాట్లాడుతూ.. శిల్పా వర్గీయుడు తులసి రెడ్డి పైన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. స్థానికంగా తులసి రెడ్డి పంచాయతీలు చేస్తుంటారని చెప్పారు. తులసి రెడ్డి పైన దాడికి గ్రామ కక్షలే కారణం కావొచ్చునని చెప్పారు.
తనకు ఇసుక మాఫియాతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనని స్పష్టం చేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, దీని విషయంలో చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదని చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీలోకి అందర్నీ కలుపుకొని పోయేందుకే వచ్చానని చెప్పారు. తాను గొడవల కోసం రాలేదన్నారు. తాను టిడిపిలోకి రావడం కొంతమందికి సంతోషాన్ని మరికొంతమందికి ఇబ్బందిని కలిగించిందన్నారు. శిల్పా తన మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నారు. టిడిపిలో చంద్రబాబుతో తనకు గ్యాప్ తీసుకు రావాలని కుట్ర చేస్తున్నారన్నారు. అయితే, ఆ తర్వాత మాత్రం చంద్రబాబును కలుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications