సొంత నియోజకవర్గంలో మంత్రికి బిగ్ బ్రేకింగ్ న్యూస్?
కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కమ్మ, కాపు, మాదిగ సామాజికవర్గాలు కీలకం. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్.
రాజకీయ సోపానంలో అడుగులు ముందుకే పడుతున్నా అందుకు పునాది లాంటి నియోజకవర్గంలో మాత్రం ఆ మంత్రికి ఎదురీత తప్పడంలేదు. సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి మంత్రి వస్తే పార్టీ నేతలే ముఖం చాటేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే, ఏపీ హోం మంత్రి తానేటి వనిత 2019లోనే కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రెండోసారి మంత్రివర్గంలో పదోన్నతి కల్పించి హోంశాఖను అప్పగించారు. అయితే సొంత నియోజకవర్గంలో సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులే ఆమెపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

మంత్రికి దూరమైన సామాజికవర్గాలు
కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కమ్మ, కాపు, మాదిగ సామాజికవర్గాలు కీలకం. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇటీవలే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఓ సామాజికవర్గానికి చెందిన నాయకులను పిలిచారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తానేటి వనితే పోటీచేస్తారని చెప్పగా సరే అన్నవారంతా కొవ్వూరు చేరుకున్న తర్వాత మాత్రం మంత్రికి ముఖం చాటేశారు. కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందినవారు ఇప్పటికే మంత్రికి దూరమయ్యారంటున్నారు. తాజాగా మాదిగ సామాజికవర్గానికి చెందినవారు కూడా అదేబాట పట్టినట్లు సమాచారం.

హాజరుకాని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు
కొవ్వూరు, చాగల్లు మండలాల్లో వనిత చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరూ హాజరు కాలేదు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రభుత్వ శాఖల సిబ్బందితో కార్యక్రమాన్ని కానిచ్చారు. సొంత పార్టీ నేతలే హోంమంత్రిపై బహిరంగ విమర్శలు చేస్తుండటంతో వ్యవహారం శ్రుతి మించుతోందని, అధిష్టానం జోక్యం చేసుకొని సర్దుబాటు చేయాల్సిందేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

కౌన్సిలర్లు కూడా..
కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 44 గ్రామ పంచాయితీలుంటే వాటిల్లో 33 పంచాయితీల్లో వైసీపీలోని కమ్మ సామాజికవర్గానికి చెందినవారి చేతుల్లో ఉన్నాయి. మిగిలిన 11 పంచాయితీల్లో కాపులదే పైచేయి. అయితే మంత్రి కావాలనే ఈ రెండు సామాజికవర్గాలను పక్కన పెట్టారంటున్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్లలో కొందరు మంత్రికి దూరమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు సైతం వైసీపీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దకపోతే మంత్రి తానేటి వనితకు ఈసారి ఎన్నికల్లో ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications