అమరావతిలో 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్దలు-6వేల జాబ్స్.. రేపే శంఖుస్థాపన..!
ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు సంస్దల నిర్మాణాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమరావతిని ఆర్ధిక హబ్ గా మార్చేందుకు వీలుగా పలు కేంద్ర, రాష్ట్ర బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు కూడా నిర్మాణాలు ప్రారంభించుకోబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాటికి రేపు శంఖుస్థాపన చేయబోతున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేపు అమరావతిలో 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల నిర్మాణాలకు శంఖుస్థాపన చేయబోతున్నారు. వీటి జాబితాను ఇవాళ సీఆర్డీయే విడుదల చేసింది. ఇందులో పలు కేంద్ర, రాష్ట్ర బ్యాంకులతో పాటు బీమా సంస్థలు కూడా ఉన్నాయి. ఆయా కంపెనీలు ఇక్కడ తమ కేంద్ర కార్యాలయాల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం ఎంత మేర పెట్టుబడి పెడుతున్నాయనే వివరాల్ని కూడా సీఆర్డీయే ఇచ్చింది.

ఇందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్దండరాయునిపాలెంలో 256 కోట్ల పెట్టుబడితో భవనాలు నిర్మించి వెయ్యి మందికి ఉపాధి కల్పించబోతోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి, ఉద్దండరాయునిపాలెంలో 40 కోట్ల పెట్టుబడితో 300 ఉద్యోగాలు కల్పించనుంది. ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) రాయపూడిలో 200 కోట్లతో 400 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దండరాయునిపాలెంలో 40 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
కెనరా బ్యాంక్ ఉద్దండరాయునిపాలెంలో 50 కోట్ల పెట్టుబడితో 300 ఉద్యోగాలు కల్పిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెంలో 300 కోట్ల పెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దండరాయునిపాలెంలో 50 కోట్లతో 160 ఉద్యోగాలు కల్పిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్దండరాయునిపాలెంలో 60 కోట్లతో 300 ఉద్యోగాలు కల్పిస్తుంది. ఇండియన్ బ్యాంక్ ఉద్దండరాయునిపాలెంలో 40 కోట్లతో 105 ఉద్యోగాలు ఇస్తుంది.

నాబార్డ్ ఉద్దండరాయునిపాలెంలో 90 కోట్ల పెట్టుబడితో 160 ఉద్యోగాలు కల్పించనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 15 కోట్ల పెట్టుబడితో 150 ఉద్యోగాలు ఇస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10 కోట్ల పెట్టుబడితో 100 ఉద్యోగాలు కల్పిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ 50 కోట్ల పెట్టుబడితో 215 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. ఎల్ఐసీ 22 కోట్ల పెట్టుబడితో 1036 ఉద్యోగాలు ఇస్తుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 93 కోట్లతో 150 ఉద్యోగాలు కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications