AP Pensions : పెన్షన్లపై జగన్ సర్కార్ కు ఊరట-పిల్ కొట్టేసిన హైకోర్టు...
ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో హైకోర్టులో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వాజ్యం విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. భారీ ఎత్తున ఇస్తున్న సామాజిక పెన్షన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ మేరకు పిల్ పై జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ విధానానికి మద్దతు లభించినట్లయింది.

ఏపీలో ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఇందులో వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా వేర్వేరు కేటగిరీల లబ్దిదారులు కూడా ఉంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇలా ఒకటి కంటే ఎక్కువ మంది లబ్దిదారులుంటే ఏం చేయాలన్న దానిపై 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఒకే కుటుంబంలో ఎంతమంది పెన్షన్ లబ్దిదారులున్నా ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేలా నిబంధనల్ని మార్చింది. ఈ మేరకు 2019 డిసెంబర్ లో జీవో నంబర్ 174 జారీ చేసింది.
దీంతో ఒకే కుటుంబంలో ఉన్న వేర్వేరు అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు రాకుండా పోయాయి. వారు పెన్షన్లకు అర్హులైనప్పటికీ ఒకే కుటుంబంలో మరొకరికి పెన్షన్ లభిస్తున్నప్పుడు వీరికి పెన్షన్ లభించే అవకాశం లేకుండా పోయింది. దీనిపై వారు అప్పటి నుంచీ పోరాడుతూనే ఉన్నారు. ఇదే అంశంపై హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లు పొందే అర్హత ఉన్నప్పటికీ ఒకే కుటుంబంలో ఉన్నారన్న కారణంతో వీరికి ప్రయోజనం నిరాకరించడం సరికాదని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు... ఇది ఆర్దికపరమైన అంశాలతో కూడిన నిర్ణయమని అభిప్రాయపడింది. అలాగే విధానపరమైన నిర్ణయమని కూడా తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై నిర్ణయాన్ని ప్రభుత్వ విచక్షణకే వదిలిపెడుతున్నట్లు తెలిపింది. దీంతో పెన్షన్ లబ్దిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల ఆధారంగానే ఉంటుందని తేల్చిచెప్పినట్లయింది.












Click it and Unblock the Notifications