టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ కు బిగ్ రిలీఫ్ .. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు !!
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా బ్యాటరీస్ కంపెనీ రెండు యూనిట్లను మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నోటీసుపై చట్టపరంగా పోరాటం చేస్తామని ప్రకటించిన అమరరాజా గ్రూప్ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా బ్యాటరీస్ కు ఊరటనిచ్చింది.

అమర్ రాజా బ్యాటరీస్ కు షాకిచ్చిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలను వరుసగా టార్గెట్ చేసుకున్న జగన్ సర్కార్ సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు తర్వాత, ఫోకస్ అమరరాజా బ్యాటరీస్ కంపెనీ పై పెట్టింది.అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న సంస్థ.ఈ సంస్థకు ఇటీవల ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం , కరకంబాడిలలో ఉన్న అమర రాజా బ్యాటరీస్ యూనిట్లను కాలుష్య నిబంధనలను పాటించని కారణంగా మూసివేయాలని ఆదేశించింది.

హై కోర్టులో అమర్ రాజాకు ఊరట , పీసీబీ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు
అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ వల్ల జల కాలుష్యం జరుగుతుందని,గాలిలోనూ లెడ్ పెరిగిపోతుందని, అందుకే ఈ యూనిట్లను మూసివేయాలని నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన అమర్ రాజా కంపెనీకి గురువారం హైకోర్టు ఊరటనిచ్చింది. కంపెనీ మూసివేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతేకాదు విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాలుష్య నియంత్రణా బోర్డు సూచనలు అమలు చెయ్యాలని ఆదేశం
ఇదే సమయంలో జూన్ 17 లోపు కాలుష్య నియంత్రణ బోర్డు చేసిన సూచనలు అమలు చేయాలని సంస్థను ఆదేశించింది. జూన్ 17 తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సూచనలు అమలు చేశారా లేదా అన్నది మళ్లీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు న్యాయస్థానం స్పష్టం చేసింది.మరోవైపు దీనిపై నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ బోర్డును సైతం హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణను జూన్ 28వ తేదీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

గల్లా జయదేవ్ కు ఊరట , ఊపిరి పీల్చుకున్న అమర్ రాజా సంస్థ కార్మికులు
దీంతో ప్రస్తుతానికి టిడిపి నేత, పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కు కాస్త ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో ప్రత్యక్షంగా 50 వేల మంది, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. సంస్థను మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏడాదికి పదివేల కోట్ల టర్నోవర్ తో అమర్ రాజా కంపెనీ వ్యాపారం నిర్వహిస్తోంది. తాజాగా కోర్టు ఆదేశాలతో కంపెనీ ఉద్యోగులు,కార్మికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications