సుప్రీం నిర్ణయంతో జగన్ కు భారీ ఝలక్-మళ్లీ తెరపైకి ఆ కేసులు-చిక్కుల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నమోదు చేసిన కేసుల్ని ఉపసంహరించింది. ఇదే క్రమంలో సీఎం జగన్ పై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్ని సైతం ఎత్తేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయంతో జగన్ సహా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇరుకునపడ్డారు. వీరిపై గతంలో ఉపసంహరించిన కేసుల్ని తిరగదోడేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతుండటం వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇందులో ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి.

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నమోదు చేసిన కేసుల్ని భారీగా ఉపసంహరించుకున్నారు. వీటిలో కొన్ని ఎఫ్ఐఆర్ దశలో ఉన్నవి కాగా.. మరికొన్ని విచారణ దశలో ఉన్నవి కూడా ఉన్నాయి. ఇంకొన్ని అయితే విచారణ పూర్తయ్యే దశలో కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ కేసులన్నీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయాయి. గత ప్రభుత్వాలు తమపై నమోదు చేసిన రాజకీయ కేసులు కాబట్టి ఉపసంహరించుకుంటున్నట్లు వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ చెప్పుకుంటోంది. కానీ ఈ వాదన మరెంతోకాలం చెల్లేలా లేదు.

తనపై కేసులు ఎత్తేసుకున్న జగన్
వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ .. గతంలో టీడీపీ ప్రభుత్వం తనపై నమోదు చేసిన 11 క్రిమినల్ కేసుల్ని స్వయంగా ఉపసంహరించుకున్నారు. ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇప్పటికే ట్రయల్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో వీటిని ఎత్తేశారు. ఈ కేసులు కూడా గుంటూరు, అనంతపురంతో పాటు ఇతర జిల్లాల్లో నమోదైనవి ఉన్నాయి. ఆధారాలు లేవనో, ట్రయల్ కోర్టులు అంగీకరించాయన్న కారణంతోనో, డీజీపీ నివేదికలు ఇచ్చారన్న కారణంతోనో ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటూ జగన్ సర్కార్ గతంలోనే జీవోలు జారీ చేసింది. విపక్షాలు దీనిపై గగ్గోలు పెట్టినా జగన్ లెక్కచేయలేదు. దీంతో జగన్ పై రాష్ట్రంలో నమోదైన కేసుల వ్యవహారంలో క్లీన్ చిట్ లభించినట్లయింది.

జగన్ కేసుల ఎత్తివేతపై హైకోర్టు విచారణ
విపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ పై నమోదైన క్రిమినల్ కేసుల్ని వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో జగన్ పై క్రిమినల్ కేసులు ఎలా వెనక్కి తీసుకుంటారంటూ హైకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో జగన్ తరఫున ప్రభుత్వం హైకోర్టుకు వివరణ కూడా ఇచ్చింది. సదరు కేసుల్లో ఆధారాలు లేవని, రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసులేనని స్పష్టం చేసింది. అయినా హైకోర్టు దీనిపై సంతృప్తి చెందలేదు. దీంతో ఈ కేసులపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దశలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కలకలం రేపుతున్నాయి.

జగన్ కు సుప్రీంకోర్టు షాక్
గతంలో ఎమ్మెల్యేగా ఉండగా తనపై నమోదైన కేసులతో పాటు తనతో పాటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై కేసుల్ని ఎత్తేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో గండిపడింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్ని హైకోర్టు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టులు ఎత్తేయడం చెల్లదంటూ సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కార్ కు భారీ షాకిచ్చాయి. ఎందుకంటే వైసీపీ సర్కార్ ఉపసంహరించిన కేసులన్నీ హైకోర్టు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టుల ద్వారానే ఉపసంహరించినవి కావడమే. వీటి ఉపసంహరణ విషయంలో ఢిల్లీ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఏపీలో వైసీపీ సర్కార్ తో పాటు పలు ప్రభుత్వాలు ఇరుకునపడ్డాయి.

ఆ కేసుల్ని సుప్రీంకోర్టు తిరగతోడితే ?
గతంలో జగన్ సర్కార్ సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్, సివిల్ కేసుల్ని సైతం ఉపసంహరించుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రకారం హైకోర్టు అనుమతి లేకుండా ట్రయల్ కోర్టులు ఉపసంహరించిన ఆ కేసులు మరోసారి తెరపైకి రానున్నాయి. వీటి ఉపసంహరణ చెల్లదని సుప్రీం తేల్చేయడంతో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు స్వయంగా జగన్ కూడా ఇరుకునపడబోతున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో వీరిపై కేసుల విచారణ ట్రయల్ కోర్టుల్లో మళ్లీ ప్రారంభం కానుంది. అదీ హైకోర్టు పర్యవేక్షణలో జరగబోతుండటం వైసీపీ సర్కార్ తో పాటు సీఎం జగన్ కూ ఇబ్బందికరంగా మారనుంది.
Recommended Video

జగన్ పై కేసులు తడిసి మోపెడు ?
సీఎం జగన్ పై ఇప్పటికే అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లతో పాటు ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపైనా హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లోనే డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్న జగన్ కు ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారబోతోంది. గతంలో టీడీపీ సర్కార్ తనపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించేందుకు హైకోర్టు ఒప్పుకోకపోతే వాటిలోనూ విచారణ ముందుకు సాగబోతోంది. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్న జగన్ కు, తన సొంత ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి రావడం మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టబోతోంది. దీంతో జగన్ తనతో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్ని తిరగతోడాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంపై ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications