బొత్సా సత్యనారాయణకు బిగ్ షాక్: టీడీపీలో చేరిన బలగం సోదరులు!
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణకు ఆయన బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహిత బంధువులైన బలగం కుటుంబం అధికారికంగా తెలుగుదేశం పార్టీ గూటికి చేరింది.
తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజకీయంగా మరియు సామాజికంగా బలగం కుటుంబానికి తణుకు పట్టణంలో మంచి పట్టు ఉంది.

బలగం సీతారాం గతంలో బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్ కుమార్‌కు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అంతేకాకుండా, తూర్పుకాపు సామాజికవర్గంలో బలగం కుటుంబానికి విశేష ఆదరణ ఉండటంతో పాటు, బలగం బాబీ గతంలో వైఎస్సార్‌సీపీ పట్టణ యూత్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి బలమైన నేపథ్యం ఉన్న నేతలు ఇప్పుడు సొంత పార్టీని వీడి సైకిల్ ఎక్కడం స్థానిక వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో ఈ చేరికలు తణుకు టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న అభివృద్ధి, సంక్షేమ విధానాలకు ఆకర్షితులయ్యే తాము టీడీపీలో చేరామని బలగం సోదరులు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, తణుకు పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇప్పటికే బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో బలగం కుటుంబం కూడా నడవడం వైసీపీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస వలసల నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తణుకు పట్టణంపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం మరింత సులువు అవుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
