Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్-నో అన్న హైకోర్టు..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారును బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన వంశీని పోలీసులు రిమాండ్ పై మూడు రోజుల క్రితం విజయవాడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో వంశీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో వంశీ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ప్రోద్భలంతో దాడి జరిగినట్లు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీతో పాటు మొత్తం 88 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణ తుది దశకు వచ్చిన తరుణంలో హఠాత్తుగా ఫిర్యాదుదారు సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటపడింది.
వల్లభనేని వంశీ అనుచరులు కొమ్మాకోట్లు, రాము, ఇతరులు సత్యవర్ధన్ ను బెదిరించడం వల్లే అతను ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు గుర్తించారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు కూడా గుర్తించారు. దీంతో వీరిని అరెస్టులు చేశారు. వంశీని అరెస్టు తర్వాత కోర్టులో హాజరుపర్చి రిమాండ్ పై జైలుకు పంపారు. పోలీసులు అరెస్టు చేయకముందే వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. ఈ మేరకు వంశీ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. మరోవైపు వంశీ తనకు జైల్లో అదనపు వసతులు కావాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ పై విజయవాడ అట్రాసిటీ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications