గుడివాడలో కొడాలి బిగ్ ట్విస్ట్..! మద్దతుగా రంగంలోకి మాజీ మంత్రి..!
గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా , మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న ఆయన.. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ కొడాలి నానికి నియోజకవర్గంలో ఓ కీలక వ్యక్తి మద్దతు లభించింది.
గుడివాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ గా పేరున్న మాజీ మంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్ కుమార్ ఇవాళ అనూహ్యంగా కలిశారు. ఒకప్పుడు గుడివాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేసిన కటారి ఈశ్వర్ కుమార్ అక్కడి నుంచే గెలిచి మంత్రిగా కూడా పనిచేసారు. అయితే ఆ తర్వాత కొడాలి ఎంట్రీ తర్వాత సైలెంట్ అయిపోయారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇవాళ కటారి ఈశ్వరకుమార్ ఇవాళ గుడివాడ రాజేంద్రనగర్ లోని కొడాలి నానిని ఆయన ఇంట్లో కలిసారు.

ఇవాళ అనూహ్యంగా కొడాలి నానితో భేటీ అయిన కఠారి ఈశ్వర్ కుమార్.. ఆయనతో కలిసి ఏకంగా పోలీసు స్టేషన్ కు వెళ్లారు. కొడాలి నానికి ఓ కేసులో కోర్టు షరతులతో సంతకం చేయాల్సి ఉండటంతో ఆయనతో కలిసి కారులో వెళ్లారు. అనంతరం స్టేషన్ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆంక్షలు ఉండటంతో కొడాలి మాట్లాడలేదు. కానీ కఠారి మాత్రం కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో 2024 ఎన్నికల్లో తన రెండు ఓట్లను కూటమికి వేశానని తెలిపారు. ఎన్నికల అనంతరం ఇప్పటివరకు తటస్థంగా ఉన్నానని.. అయితే గుడివాడలో టీడీపీ గూండాల అరాచకాల్ని గతంలోనే ప్రశ్నించానని తెలిపారు.

గుడివాడలో పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే రాముకు ఫోన్ చేసి సరైన పద్ధతి కాదని వారించానని, అయినా తీరు మార్చుకోకుండా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తుండటం దారుణమని కఠారి విమర్శించారు. టిడిపి గుండాల అరాచకాలను ఖండిస్తూ కొడాలి నానికు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి వైసీపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తే బాధితులకు అండగా ఉంటానని, న్యాయం జరిగే వరకూ పోరాడుతానని తెలిపారు. గుడివాడలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారని.. వారు పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగితే బాగుంటుందని సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications