EL Nino ఎఫెక్ట్: రైతులకు మధ్యంతర కరవు ముప్పు ? ఆ పంట మాత్రం వేయొద్దు..!
ఈసారి వేసవి తర్వాత రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు (Farmers) ఎల్ నినో (El Nino) పరిస్ధితులు టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా ఈసారి వర్షపాతం ఎలా ఉంటుందో తెలియని పరిస్ధితుల్లో పంటలు వేస్తే నష్టపోతామన్న భయం వారిలో ఎక్కువగా ఉంది. ఇప్పటికే వాతావరణ విభాగం కూడా దీనిపై పలుమార్లు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం పంటల సాగుపై ఇదే రకమైన హెచ్చరికల చేశారు.
ఈసారి ఎల్ నినో పరిస్ధితులపై అధ్యయనం చేస్తున్న హైదరాబాద్ లోని ఐకార్-క్రిడా శాస్త్రవేత్త కేవీ రావు.. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కీలక సూచనలు చేశారు. జూన్ లో తొలకరి వర్షాల్ని చూసి వరి సాగుకు వెళ్లొద్దంటూ ఆయన రైతుల్ని హెచ్చరించారు.
నీటి లభ్యతపై స్పష్టత వచ్చిన తర్వాతే సాగు చేయాల్సిన పంటల్ని ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఎందుకంటే జూలై, ఆగస్టులో మధ్యంతర కరువు పొంచి ఉందని ఆయన చెప్తున్నారు.

కాబట్టి అధిక నీరు అవసరమయ్యే దీర్ఘకాలిక వరి రకాల సాగుపై అప్రమత్తంగా ఉండాలని రైతుల్ని క్రిడా శాస్త్రవేత్త కేవీ రావు కోరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా సాగునీరు అందుబాటులో ఉంటుందన్న భరోసా ఉన్నప్పుడే వరి సాగు చేయాలని ఆయన సూచిస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో సాగు చేస్తే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆయన రైతులకు సూచన చేశారు. అలాగే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా అనుసరించాలన్నారు. ఇందులో కరువును తట్టుకునే పంటల రకాలు, ఆలస్య వర్షాలకు అనువైన పంటలు, నీటి పొదుపు సాగు విధానాలు అనుసరించాలని కోరారు. జిల్లాల వారీగా వ్యవసాయ అధికారుల సూచనల్ని పాటించాలన్నారు.












Click it and Unblock the Notifications