ఆ సీట్ల కోసమే పట్టు, తగ్గాల్సిందెవరు - పొత్తుపై ఢిల్లీలో కొత్త లెక్కలు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ ఎన్నికల పొత్తులపై హైడ్రామా కొనసాగుతోంది. పొత్తు ఖాయమైనట్లే అని చెబుతున్నా...ఇంకా అధికారికం కాలేదు. సీట్ల గురించి పట్టింపు లేదంటూనే అక్కడే ప్రతిష్ఠంబన కొనసాగుతోంది. ఈ సీట్ల లెక్కల పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కోరుతున్నట్లుగా టీడీపీ సీట్లను కేటాయిస్తే ఈ రోజే పొత్తు అధికారికం కానుంది. సీట్ల గురించి రెండు పార్టీలు తగ్గకపోతే నిర్ణయం మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.
పొత్తు ఖాయం, కానీ:
2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం సీట్ల దగ్గరే నిర్ణయం పెండింగ్ లో ఉంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీకి 5 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చర్చల సమయంలో బీజేపీ గౌరవ ప్రదమైన సీట్లు కోరుకుటోందని స్పష్టం చేసారు.

ఒడిశా, మహారాష్ట్ర, బీహర్ లో మిత్రపక్షాలతో జరిగిన సీట్ల ఒప్పందాలను నడ్డా ప్రస్తావించారు. పొత్తులో భాగంగా జనసేనకు 3 సీట్లు ఇవ్వటంతో...మిగిలిన 22 ఎంపీ స్థానాల్లో బీజేపీ - టీడీపీ షేర్ ఏంటో తేల్చాలని సూచించారు. బీజేపీ కోరుకుంటున్న 11 స్థానాల జాబితాను చంద్రబాబుకు ఇచ్చినట్లు సమాచారం.
ఆ సీట్ల పైనే పట్టు:
అయితే, పార్టీ నేతలతో చర్చించిన తరువాత చంద్రబాబు 6 ఎంపీ స్థానాలు.. 12 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. బీజేపీ కోరిన జాబితాలో విశాఖ, విజయవాడ, హిందూపురం, అనంతపురం పైనే నిర్ణయం సమస్యగా మారుతోందని సమాచారం. అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు.
బీజేపీ పట్టుపడితే విశాఖ వదులుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, విజయవాడ, హిందూపురం సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబు సిద్దంగా లేరని చెబుతున్నారు. బీజేపీ మాత్రం విజయవాడతో పాటుగా హిందూపురం సీట్ల పైనే గట్టిగా ఉందని తెలుస్తోంది. దీంతో, చంద్రబాబు ఈ సీట్ల విషయంలో చెప్పే నిర్ణయం కీలకం కానుంది.
తుది నిర్ణయం ఏంటి:
దీంతో..సీట్ల సర్దుబాటు పైన నడ్డా, చంద్రబాబు, పవన్ తొలుత సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సీట్ల పైన తుది అంచనాలు సిద్దమైన తరువాత అమిత్ షాతో తుది సమావేశం ఉంటుందని తెలుస్తోంది. పొత్తు ఖాయంగానే కనిపిస్తున్నా సీట్ల సర్దుబాటు పైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ సైతం ఢిల్లీలోనే ఉన్నారు.
మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఈ రోజు సీట్లు.. పొత్తులు ఫైనల్ చేసుకోవాలని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు ఉండాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. దీంతో, బీజేపీ నేతల ఒత్తిడి మేరకు మిగిలిన సీట్ల విషయంలో రాజీ పడి..అంగీకరిస్తారా... చంద్రబాబు చెప్పే క్షేత్ర స్థాయి పరిస్థితులతో ఏకీభవించి ఆమోదిస్తారా లేదా అనేదే ఇప్పుడు పొత్తుల లెక్కల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications