అవినాష్ అరెస్టుపై టెన్షన్ ఎందుకు ? సీబీఐని ఏ శక్తీ ఆపలేదు- జీవీఎల్ కామెంట్స్..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఆయన తన అరెస్టు, ముందస్తు బెయిల్ పై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐపై ఒత్తిడి వల్లే అవినాష్ ను అరెస్టు చేయడం లేదంటూ టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ ఆరోపణలపై స్పందించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ అవసరం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఆగబోవన్నారు. సీబీఐ నిర్ణయించుకుంటే మాత్రం ఎవరినైనా అరెస్టు చేస్తుందని జీవీఎల్ తెలిపారు. ఇందులో సీబీఐని ఏ శక్తీ అపలేదన్నారు. తద్వారా సీబీఐ అవినాష్ అరెస్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జీవీఎల్ చెప్పకనే చెప్పారు.

మరోవైపు తన తల్లి అనారోగ్యం పేరుతో సీబీఐ విచారణకు హాజరుకాకుండా కర్నూలు ఆస్పత్రిలోనే ఉండిపోయిన ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై విపక్షాలు నిత్యం ఆరోపణలు చేస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా అవినాష్ కు మద్దతుగా కర్నూల్లో ఆస్పత్రి వద్ద మోహరించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా హైకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ తర్వాత వెలువడే నిర్ణయం ఆధారంగా సీబీఐ అరెస్టుపై నిర్ణయం తీసుకోబోతోంది.
ఇప్పటికే వివేకా కేసులో పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ.. అధికార వైసీపీ ఎంపీ అయిన అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం అంతే దూకుడుగా వెళ్లలేకపోతోంది. అయితే ఆయన పదే పదే న్యాయస్ధానాల్ని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా ఎలాంటి లోపాలకు తావులేకుండా ఆయన విచారణ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణలకు బీజేపీ నేతలు కూడా దీటుగా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications