టీడీపీకి మింగుడు పడని బీజేపీ నియామకాలు - ఏరి కోరి, తెర వెనుక..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా ఉంటూ సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీ ఈ సారి తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. గతం కంటే భిన్నంగా ఏపీకి సాయం విషయంలో కేంద్రం ఉదారంగా ఉంది. అవసరమైన మేర సాయం అందిస్తోంది. ఇదే సమయంలో రాజకీయంగానూ పట్టు బిగిస్తోంది. పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా తాజాగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం టీడీపీ కేడర్ కు మింగుడు పడటం లేదు.
పట్టు బిగిస్తున్న బీజేపీ
ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఏపీలో బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పెద్దన్న పాత్ర పోషిస్తోంది. బీజేపీ నిర్ణయాలకు టీడీపీ, జనసేన అంగీకారం తెలపాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న నిర్ణయాల్లో బీజేపీ అనుకున్న విధంగానే ఏపీలో రాజకీయం చేస్తోంది. ఏపీలో బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే, బీజేపీకి ఏపీ నుంచి ప్రస్తుతం రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం నామినేషన్ వేసిన అభ్యర్ధి ఎన్నిక సైతం ఏకగ్రీవం కానుంది. దీంతో, వ్యూహాత్మకంగానే బీజేపీ మిత్రపక్షాల నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం ఇవ్వకుండా.. తమ అభ్యర్ధులనే ఖరారు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎంపీ సీట్ల విషయంలో.. ఇప్పుడు రాజ్యసభ స్థానాల విషయంలోనూ బీజేపీ పట్టు జారటం లేదు.

ఏరి కోరి నియామకాలు
ఇక.. బీజేపీ నుంచి జరుగుతున్న నియామకాలు టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారికే ఇప్పుడు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ పదవు లు కట్ట బెడుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన ఎమ్మెల్సీ స్థానం సోము వీర్రాజు, ఇప్పుడు రాజ్యసభ సీటు పాకా వెంకట సత్యనారాయణ కు కేటాయించారు. ఈ నిర్ణయాల పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల కోసం రెండు రాజ్యసభ సీట్లు.. అందునా, చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన వారికి అవకాశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన వారికి గుర్తింపు గా ఈ పదవులు ఇచ్చినట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పక్కా వ్యూహం
బీజేపీ ఏపీ కేంద్రంగా పక్కా వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అందు లో భాగంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో సొంతంగా బలం పెంచుకోవాలని బీజేపీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగా టీడీపీ - జనసేన నేతలు నో అనలేని పరిస్థితి కల్పిస్తూ.. తమ నిర్ణయాలను అమలు చేస్తోంది. వైసీపీ నుంచి ఇప్పటి వరకు నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు రాగా.. అందులో రెండు స్థానాలు టీడీపీ.. మరో రెండు స్థానాలు బీజేపీకి దక్కేలా నిర్ణయాలు జరిగాయి. జనసేనకు ఒక్కటీ ఇవ్వలేదు. దీంతో, బీజేపీ రానున్న రోజుల్లో మరింత పక్కా వ్యూహాలతో పార్టీ భవిష్యత్ కోసం నిర్ణయాలు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications