మళ్లీ తెలంగాణ తేనెతుట్టెను కదిపిన కిరణ్..వైఎస్ కు లింక్ చేస్తూ కామెంట్స్..!
ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయారన్న అపప్రదను మూటగట్టుకున్న ప్రస్తుత బీజేపీ నేత, అప్పటి కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో జరిగిన పరిణామాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. విజయవాడలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కిరణ్.. అప్పట్లో వైఎస్ బతికుంటే ఏం జరిగిందో, తాను ఉండి ఏం చేశానో చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు జరిగినా ఆ విషయాల్ని కిరణ్ మర్చిపోలేదా అన్న చర్చ జరుగుతోంది.
2014లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగానే తెలంగాణ విభజన జరిగింది. 2009లో వైఎస్ మరణం తర్వాత రాష్ట్రానికి రోశయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. కానీ వైఎస్ తర్వాత సీఎంలు అయిన వీరిద్దరూ తెలంగాణ ఏర్పాటను అడ్డుకోలేకపోయారన్న అపప్రద ఎదుర్కొన్నారు. అయితే వైఎస్ బతికున్నా తెలంగాణ ఏర్పాటు మాత్రం ఆగేది కాదంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు వెల్లడించారు. దీని వెనుక కారణం కూడా చెప్పేశారు.

2009 ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ తమ ముందు తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన పెట్టిందని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అప్పట్లో తాము దీన్ని వ్యతిరేకించామని, అయితే వైఎస్ మరణం తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగానే ఉన్నట్లు కిరణ్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయారన్న అపప్రద తనపై సరికాదని, వైఎస్ ఉన్నా అప్పట్లో చేసేదేమీ లేదని కిరణ్ చెప్పినట్లయింది.
వాస్తవానికి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో భాగమైన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ముందు జరిగిన తెలంగాణ ప్రాంత ఎన్నికల్లో రెగ్యులర్ గా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రచారం చేసిన వైఎస్.. ఆ తర్వాత రెండో విడతలో సీమాంధ్రలో జరిగిన ప్రచారంలో మాత్రం తెలంగాణ ఏమైనా పాకిస్తానా అక్కడికి రాకుండా సీమాంధ్రుల్ని అడ్డుకోవడానికి అని ప్రశ్నించారు. దీంతో అప్పట్లో వైఎస్ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారి తెలంగాణ ఉద్యమానికి దారి తీశాయన్న వాదన ఉంది. కానీ వైఎస్ చనిపోవడంతో బలహీన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అడ్డుకోలేకపోయారన్న చర్చ సాగింది.












Click it and Unblock the Notifications