కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు రద్దు కాలేదు, పవన్ మాతోనే - బీజేపీ..!!
ఏపీలో పొత్తుల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్న పవన్ కల్యాణ్ తమతో బీజేపీని కలిసి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీ వెళ్లి మంతనాలు చేసారు. బీజేపీ నేతలు నుంచి మాత్రం ప్రతికూల స్పందన కనిపిస్తోంది. పవన్ తో అనుకూలంగా వ్యవహరిస్తూ..టీడీపీ పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు పైన బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
జనసేనాని పవన్ జనాకర్షణ కలిగిన నేతగా సునీల్ దేవధర్ పేర్కొన్నారు. పవన్ ఎప్పటికీ బీజేపీతోనే కలిసి ఉంటారని చెప్పారు. తమ రెండు పార్టీల పొత్తు అధికారికంగానే కొనసాగుతుందన్నారు. టీడీపీ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీతో బీజేపీ కి పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని..ఆ పొత్తును రద్దు చేసినట్లు ఇప్పటి వరకు టీడీపీ ప్రకటన చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు ఇంకా కాంగ్రెస్ తోనే ఉన్నారని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో తమ వలనే కాంగ్రెస్ గెలిచిందంటూ అక్కడ టీడీపీ ఇంఛార్జ్ ప్రకటించారని సునీల్ దేవధర్ పేర్కొన్నారు. ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..ఈ వ్యాఖ్యలు పరిశీలిస్తే పొత్తు విషయంలో బీజేపీ వైఖరి స్పష్టం అవుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

అటు టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ సైతం పవన్ తో జరుగుతున్న పొత్తు చర్చల గురించి స్పష్టత ఇచ్చారు. బీజేపీతో పొత్తు పైన మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మేమేమైనా పొత్తు కోసం ఆ పార్టీని కలిశామా అని ప్రశ్నించారు. దీని ద్వారా ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా..బీజేపీ ఈ రెండు పార్టీలతో కలవటం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికీ పవన్ తో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. తన ప్రతిపాదన పైన సానుకూలంగా లేని బీజేపీతో మైత్రి కొనసాగింపు పైన పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే మహానాడు వేదికగా టీడీపీ వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో కూడా ప్రకటించింది. ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
ఏపీలోనూ బీజేపీ ప్రతీ గడపకు వెళ్తుందని సునీల్ దేవధర్ చెప్పుకొచ్చారు. జూన్ 1 నుంచి నెలాఖరు వరకు నియోజకవర్గాల స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతారని వెల్లడించారు. కేంద్ర సంక్షేమ పథకాలను వివరిస్తారని..కరపత్రాలను పంపిణీ చేస్తారని వివరించారు. కేంద్ర మంత్రులు నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తారని చెప్పారు. బీజేపీ సాధించిన విజయాలను వివరిస్తారని పేర్కొన్నారు. టీడీపీ నేరుగా ఇప్పటి వరకు బీజేపీతో తాము పొత్తు కోరుకుంటున్నట్లుగా ఎక్కడా ప్రస్తావన చేయలేదు. పవన్ చేసిన ప్రతిపాదన పైన బీజేపీ స్పందనకు అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉంది. ప్రధాని మోదీ నిర్ణయాలను పలు సందర్భాల్లో చంద్రబాబు సమర్ధించారు. ఇప్పుడు దేవధర్ చేసిన వ్యాఖ్యలతో రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications