Vande Bharat: ప్రతి సోలో ట్రావెలర్ చూడాల్సిన 8 అద్భుతమైన రూట్లు!
తరం మారుతోంది.. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. వయసు పైబడినప్పుడు కృష్ణా-రామా అనుకుంటు తీర్థయాత్రలు సందర్శించే రోజులు పోయాయి. జెన్ జీ నుంచి కాటికి కాలు చాపిన వారి వరకు ప్రయాణాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే సోలో ట్రావెల్ ట్రెండ్ చాలా మందిని క్యూరియాసిటికి గురిచేస్తుంది. వారం అంతా కష్టపడి పని చేసినా.. వీకెండ్ లో "చిల్ అవ్వాలి బ్రో.. మళ్లీ పుడతామా ఏంటి" అంటున్నారు నేటి తరం. ఈ క్రమంలోనే ట్రావెలింగ్ ఇష్టపడే పర్యాటకులకు, ముఖ్యంగా సోలో ట్రావెల్ చేయాలనుకునే వారి కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక సరికొత్త అనుభూతిని అందిస్తోంది.
వేగవంతమైన ప్రయాణం, సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక వసతులతో కూడిన ఈ రైళ్లు దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి. అంతర్జాతీయ విమాన టిక్కెట్లు, పాస్‌పోర్ట్ స్టాంపులు అవసరం లేకుండా.. కేవలం ఒక విండో సీట్, ఒక బ్యాక్‌ప్యాక్, నచ్చిన ప్లేలిస్ట్‌తో వందే భారత్ ఎక్కితే చాలు, మీ సోలో ట్రావెల్ కల నిజమైపోతుంది. సామాన్యులకు సైతం సులభంగా, సురక్షితంగా ప్రయాణించేలా వందే భారత్ ద్వారా ప్రతి సోలో ట్రావెలర్ తప్పక అన్వేషించాల్సిన 8 అద్భుతమైన రూట్ల వివరాలతో వన్ ఇండియా స్పెషల్ స్టోరీ.

1. ఢిల్లీ - ఖజురహో
సోలో ట్రావెల్ అంటే కేవలం బీచ్‌లు, కేఫ్‌లు మాత్రమే కాదు. శతాబ్దాల నాటి అద్భుతమైన ఆలయ శిల్పకళ, సాయంత్రం వేళ జరిగే లైట్ అండ్ సౌండ్ షోలు, ప్రశాంతమైన వీధులు ఖజురహో ప్రత్యేకత. చరిత్రను ఇష్టపడుతూ ప్రశాంతంగా ఒంటరి ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ రూట్ పర్‌ఫెక్ట్ ఛాయిస్.
2. ఢిల్లీ - భోపాల్
కొన్ని నగరాలు మనల్ని పరుగులెత్తిస్తాయి, కానీ భోపాల్ మాత్రం మనల్ని ప్రశాంతంగా మార్చుతుంది. ఉదయాన్నే అప్పర్ లేక్ (Upper Lake) ఒడ్డున నడక, మధ్యాహ్నం మ్యూజియంల అన్వేషణ, సాయంత్రం స్థానిక స్ట్రీట్ ఫుడ్ రుచులను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. మొదటిసారి సోలో ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఈ నగరం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
3. చెన్నై - విజయవాడ
దక్షిణాది సోలో ట్రావెలర్స్ కోసం ఈ రూట్ ఎంతో ప్రత్యేకం. ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం, కృష్ణా నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆంధ్ర వంటకాల ఘాటును ఇక్కడ రుచి చూడవచ్చు. కొత్తగా ప్రయాణించే వారైనా ఈ నగరంలో సులభంగా తిరగవచ్చు.
4. మంగళూరు - మడ్‌గావ్ (కొంకణ్ తీర సౌందర్యం)
గోవా చేరుకోవడానికి ముందే కొంకణ్ తీరప్రాంతం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నదులు, చీకటి సొరంగాలు, కొబ్బరి తోటలు, అంతులేని సముద్రపు వీక్షణలు ఈ రైలు ప్రయాణాన్ని భారతదేశంలోనే అత్యంత సుందరమైనదిగా మారుస్తాయి. గోవా చేరుకున్నాక ప్రశాంతమైన బీచ్‌లు, పోర్చుగీస్ కాలం నాటి వీధులు, చిన్న చిన్న కేఫ్‌లలో హ్యాపీగా గడపవచ్చు.
5. హౌరా - పూరి (సముద్ర తీరాన సూర్యోదయం)
చాలామంది పూరి అనగానే జగన్నాథ ఆలయాన్ని గుర్తుచేసుకుంటారు. కానీ సోలో ట్రావెలర్స్‌కు ఇక్కడ బంగాళాఖాత తీరాన జరిగే సూర్యోదయం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పర్యాటకుల రద్దీ పెరగకముందే.. ఉదయాన్నే బీచ్ ప్రాణం పోసుకుంటున్న దృశ్యాన్ని ఒంటరిగా వీక్షించడం జీవితాంతం గుర్తుండిపోయే క్షణం.
6. హౌరా - న్యూ జల్పాయిగురి (మంచు కొండల మజిలీ)
హిల్ స్టేషన్ అనగానే ఘాట్ రోడ్ల ప్రయాణాలే గుర్తుకురానక్కర్లేదు. వందే భారత్ ద్వారా సాగే ఈ రూట్ డార్జిలింగ్ టీ తోటలు, టాయ్ ట్రైన్ ప్రయాణాలు, మంచుతో కప్పబడిన కొండల వీక్షణలకు దారి చూపుతుంది. ప్రకృతిని అమితంగా ప్రేమించే సోలో ట్రావెలర్స్‌కు ఇది ఒక వరం.
7. అహ్మదాబాద్ - జోధ్‌పూర్ (బ్లూ సిటీ అన్వేషణ)
జోధ్‌పూర్ అంటే కేవలం కోటలు మాత్రమే కాదు. ఇక్కడి నీలి రంగు వీధులు, నోరూరించే గులాబ్ జామూన్లు, మిర్చి బజ్జీలు, స్థానిక హస్తకళల మార్కెట్లు ఎంతో ఆకట్టుకుంటాయి. మెహ్రాన్‌గఢ్ కోట వైపు చూస్తూ రూఫ్‌టాప్ కేఫ్‌లలో గడపడం ఒంటరి ప్రయాణికులకు సరికొత్త జోష్ ఇస్తుంది.
8. ముంబై - హజూర్ సాహిబ్ నాందేడ్ (ప్రశాంతతకు కేరాఫ్)
కొన్ని ప్రయాణాలు కేవలం ప్రదేశాలను చూడటానికి మాత్రమే కాదు, మన మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడానికి ఉపయోగపడతాయి. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన నాందేడ్‌లో ప్రశాంతమైన వాతావరణం, నదీ తీరంలో ఒంటరి నడకలు నిత్య జీవితంలోని ఒత్తిడి నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ఉత్తమ మార్గం.
వందే భారత్ ఎందుకు ప్రత్యేకం?
ఈ ఎనిమిది రూట్లలో కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, ఒంటరిగా వెళ్లే పర్యాటకులకు కావలసిన భద్రత, నమ్మకమైన స్థానిక రవాణా, స్టే చేయడానికి మంచి హోటల్స్ సులభంగా దొరుకుతాయి. వందే భారత్ కేవలం మిమ్మల్ని వేగంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు, ప్రయాణ అలసట లేకుండా ఉత్సాహంగా ఆయా నగరాలను అన్వేషించేందుకు తగినంత సమయాన్ని, శక్తిని మిగులుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ వందే భారత్ విండో సీట్ బుక్ చేసుకుని సోలో ట్రిప్‌కు రెడీ అవ్వండి!














Click it and Unblock the Notifications