షర్మిల ఎంట్రీతో బీజేపీ అలర్ట్ - టీడీపీతో పొత్తు వేళ కీలక పరిణామాలు..!!
ఏపీ రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్నారు. ఇప్పటికే పొత్తు ప్రకటించిన టీడీపీ, జనసేన తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు ఖాయం చేసుకుంటోంది. బీజేపీ ఇక ఆలస్యం చేయకుండా పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇందు కోసం ముఖ్య నేతలు ఏపీకి వస్తున్నారు. కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
ఏపీలో కొత్త పొత్తులు : బీజేపీతో జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పొత్తు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. ఏపీలో బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. సంక్రాంతి లోగా బీజేపీ సానుకూల నిర్ణయంతో మందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో మారుతున్న ఎన్నికల రాజకీయంతో బీజేపీ అలర్ట్ అయింది. అటు షర్మిలకు బాధ్యతలు అప్పగించి బలం పెంచుకొనే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, బీజేపీ నాయకత్వం ఏపీలో అమలు చేయాల్సిన కార్యాచరణ సిద్దం చేసేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దించింది.

నిర్ణయం దిశగా బీజేపీ : బీజేపీ రాష్ట్ర పథాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఈ రోజు జరుగుతోంది. ఇందులో భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పొత్తుల పైన అందరి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఎన్నికల్లో పోటీకి సమాయత్తం చేసే క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేసారు. ఏపీలో పొత్తుల అంశం తేల్చటంతో పాటుగా పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు పార్టీ ముఖ్య నేత తరుణ్ చుగ్ కు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. రేపు (గురువారం) ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. పొత్తుల పైన సభ్యుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఏపీలో జనసేన ,బీజేపీ కలిసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించటం పైన నాయకత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. బీజేపీలో బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లటం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన అంశాన్ని పార్టీ నాయకత్వం గుర్తు చేస్తోంది.

ప్రధాని మోదీ ఫైనల్ డెసిషన్ : ఇటు ఏపీలో పొత్తులతో వెళ్లాలా..ఒంటరిగా వెళ్లాలా అనేది రాష్ట్ర పార్టీ అభిప్రాయం సేకరించి కేంద్ర నాయకత్వానికి అందించనున్నారు. పొత్తులతో వెళ్తే పార్టీకి వచ్చే లాభం..ఒక వేళ పొత్తు ఖరారు చేస్తే రాష్ట్ర పార్టీ ఏం కోరుకుంటోందనేది పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పవన్ కలవటం పైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు పార్టీ సుముఖంగా లేకపోతే పవన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పటికే బీజేపీ నేతలు ఒక స్పష్టతకు వచ్చారు. దీంతో, తరుణ్ చుగ్ పార్టీ నేతలతో నిర్వహించే సమావేశం..ఆ తరువాత ఇచ్చే నివేదిక పైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఏపీ విషయంలో ప్రధాని మోదీ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఈ రెండు రోజుల్లో బీజేపీ తమ వైఖరి స్పష్టం చేయనుంది.












Click it and Unblock the Notifications