బీజేపీ ఒత్తిడికి చంద్రబాబు లొంగుతారా - ఏం జరగుతోంది..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. మూడు పార్టీల కూటమి నుంచి సీట్లు, అభ్యర్దుల ఖరారు పూర్తయింది. కానీ, టీడీపీ, బీజేపీ నుంచి ఇంకా కొన్ని సీట్లు మార్పు పైన చర్చ సాగుతోంది. నర్సాపురం సీటు విషయంలో చంద్రబాబు ప్రతిపాదనకు బీజేపీ నో చెప్పింది. దీంతో, రఘురామకు చివరకు చంద్రబాబు ఉండి సీటు కేటాయించారు. కాగా, బీజేపీ నుంచి చంద్రబాబు పై తాజాగా మరో సీటు కోసం ఒత్తిడి పెరుగుతోంది.
విశాఖ సీటు కోసం
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు ఖరారయ్యాయి. బీజేపీ తమ అభ్యర్దులను సైతం ప్రకటించింది. బీజేపీ తొలి నుంచి విశాఖ సీటు పైన ఆశలు పెట్టుకుంది. కానీ, చంద్రబాబు విశాఖ సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. ఫలితంగా తొలుత జనసేనకు కేటాయించిన అనకాపల్లి సీటును బీజేపీకి ఇచ్చారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్దిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. కానీ, విశాఖ సీటు పైన ఆశలు పెట్టుకున్న జీవీఎల్ నర్సింహారావు మద్దతు దారులు ప్రస్తుతం బీజేపీ నాయకత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఫ్రెండ్లీ పోటీకి అయినా అంగీకరించాలని కోరుతున్నారు. వార ప్రయత్నాలు కొనసాగుతున్న సమయం లోనే తాజాగా జీవిఎల్‌కు మద్దతుగా విశాఖలో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

బీజేపీ నేతల ప్రయత్నం
విశాఖ లాంటి బీజేపీకి బలం ఉన్న, గతంలో విజయం సాధించిన చోట టికెట్ కేటాయించకపోవడం అన్యాయం అంటూ ప్రెస్ మీట్ లు, ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలవడం లాంటి యాక్షన్ ప్లాన్ కొనసాగుతూ ఉంది. తాజాగా జన జాగరణ సమితి అనే ఓ సంస్థ విశాఖ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపింది. విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పని చేస్తూ పదే పదే పార్లమెంట్ లో విశాఖ గళం వినిపించిన జీవీఎల్ నరసింహారావుకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం అని వాదిస్తోంది. విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అత్యధికంగా ఉండడం వల్ల అందులో పని చేస్తున్న నార్త్ ఇండియన్ ఉద్యోగులు, వ్యాపారులు బీజేపీకి అనుకూలంగా ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
చంద్రబాబు అంగీకరిస్తారా
ఏపీలో బీజేపీకి కొంత బలంగా ఉన్నది విశాఖపట్నంలో మాత్రమే. అలాంటప్పుడు బీజేపీకి విశాఖపట్నం పార్లమెంటు సీటును కనీసం కోరుకోలేదంటే, ఇతరుల రాజకీయాలకు జీవీఎల్ బలి అయ్యారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 2014లో విశాఖ ఎంపీగా గెలిచారు హరిబాబు. అప్పుడు టీడీపీ-జనసేన మద్దతు ఉంది. ఇప్పుడు స్నేహపూర్వక పోటీ అని చెప్పి బీజేపీ ఒంటరిగా వెళ్తే జీవీఎల్ గెలుస్తారా అనే చర్చ మొదలైంది. సీటు టీడీపీకి కేటాయించిన తరువాత టికెట్ కోసం జీవీఎల్ ప్రయత్నించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ విషయంలో బీజేపీ నుంచి ఒత్తిడి వస్తే చంద్రబాబు ఏం చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications