బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలు ? తమ నిర్ణయం అదేనన్న ఆదినారాయణరెడ్డి ..!
ఏపీలో తాజా ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనూ కలవరం పుట్టిస్తోంది. ఇంకా వైసీపీలో కొనసాగితే తమ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరిలో కొందరు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇవాళ స్పందించారు. తమ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పేశారు.
రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత అమరావతిలో రాజధాని పనులు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో వాటిని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పరిశీలించారు. జగన్ ఓటమికి అమరావతి రాజధాని ఉద్యమం కూడా ఓ కారణమని ఆది తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలని చూసిన జగన్ కు జనం బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ త్వరలో భూస్థాపితం అవుతుందని ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు.

వైసీపీ దారుణ ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆదినారాయణరెడ్డి మరోసారి వెల్లడించారు. అయితే వీరిని బీజేపీలో చేర్చుకునేది లేదని ఆది స్పష్టం చేశారు. ఆ మేరకు పార్టీ నేతలు స్పష్టతతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే బీజేపీ వైసీపీ ఎంపీల్ని తమవైపు తిప్పుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో ఆది నారాయణరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications