TDPని నిర్వీర్యం చేయడమే 'పెద్దల' ప్లాన్..!?
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దల ప్రణాళిక వేరుగా ఉంది. ఏపీ, తెలంగాణ రెండూ కవల రాష్ట్రాలే అయినప్పటికీ భిన్నమైన రాజకీయ పోకడలు పోతుంటాయి. ఓటరుగా తీర్పునివ్వడంలో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య భిన్న వైరుధ్యం ఉంది. ఏపీ ప్రజలు కులాలకు ప్రాధాన్యమిస్తుండగా, తెలంగాణ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు. రెండు రాష్ట్రాల ప్రజలూ విద్యావంతులే. కానీ ఏపీలో కులాలకే ప్రాధాన్యమెక్కువ.

రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని..
రెండు రాష్ట్రాల్లోను పాగా వేయాలనేది భారతీయ జనతాపార్టీ పెద్దలు యోచన. మొదటి నుంచి ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా వారు ఒకటే సూత్రాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు ప్రతిపక్షంపై గురిపెడతారు. కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల కలిగే లాభాలన్నింటినీ క్రోడీకరించుకొని, వాటిని ఉపయోగించుకొని విపక్షాన్ని వివిధ రీతుల్లో నిర్వీర్యం చేస్తారు. బలమైన నేతలుంటేనే పార్టీ విస్తరించగలుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మే భారతీయ జనతాపార్టీ పెద్దలు విపక్షంలోని బలమైన నేతలను బీజేపీలోకి చేర్చుకుంటారు. ఇక్కడితో ఆ పార్టీ ప్రణాళికలో మొదటి అంకం పూర్తయినట్లు లెక్క.

ముందుగా విపక్ష స్థానంలోకి చేరుకోవడం
విపక్షం నుంచి ఆ రాష్ట్రంలో అధికార పక్షానికి చేరుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉండటం ద్వారా ఉండే అనుకూలతలను ఉపయోగించుకుంటుంది. ఇందులో వారికి తన, మన అనే భేదం అసలు ఉండదు. పాటించరు కూడా. ఆసేతు హిమాచలం కమలం జెండాను రెపరెపలాడించాలన్నదే వారి లక్ష్యం. అవసరమైతే అద్వానీ లాంటి నేతలను కూడా ఇంట్లో కూర్చోపెట్టగలరు. ఇలా ఆ పార్టీ మూడోస్థానం నుంచి రెండో స్థానానికి, అక్కడి నుంచి మొదటి స్థానానికి దశలవారీగా చేరుకుంటుంది. ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉందనే విషయం తెలిసిందే. టీడీపీని బలహీనపరిచి ఆ పార్టీ లోని నేతలను తమ పార్టీలోకి తీసుకోవడంద్వారా ముందుగా విపక్షస్థాయికి చేరుకోవాలనే బీజేపీ ప్రణాళిక.

అన్నిటికీ రాజకీయమే కారణం
పవన్ కల్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బీజేపీ నాయకులు వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కరోనావల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని జనసేనాని స్వయంగా చెప్పారు. పవన్ ను ఖాతరుచేయని బీజేపీ అకస్మాత్తుగా మోడీతో భేటీ అయ్యేలా చూడటం కూడా రాజకీయ కోణమే ఇమిడివుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీకి మైనస్ అవుతుంది.. అలాకాకుండా విడివిడిగా పోటీచేస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది కాబట్టి టీడీపీని నిర్వీర్యంచేసి ఆ స్థానంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి జనసేన వెళ్లి టీడీపీతో కలవడం ఇష్టంలేదు. అలా అని వైసీపీ మీద ప్రేమ ఉండదు. వారికి రాజకీయ అవసరాలే ముఖ్యం.

కాలమే సమాధానం చెప్పాలి
పరిణామాలకు అనుగుణంగా వ్యూహం మార్చుకుంటున్నానని ప్రకటించిన జనసేనాని వెళ్లి చంద్రబాబుతో కలిస్తే టీడీపీ బలహీనపడదు. అందుకే పవన్ కల్యాణ్ ను టీడీపీకి దూరంగా ఉంచే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గత ఎన్నికల్లో తనవల్ల చీలిందని బహిరంగంగానే ఒప్పుకునే పవన్ ఈసారి అటువంటి పరిస్థితి రానివ్వనని స్పష్టంగా చెబుతున్నారు. పొత్తులకు సిద్ధమంటున్నారు. అయితే ఒకవైపు బీజేపీ అవసరాలు.. మరోవైపు వైసీపీపై తన పోరాటం.. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఏవిధంగా రూట్ మ్యాప్ ఇవ్వబోతోంది? అనే ఉత్కంఠ జనసేన వర్గాల్లో ఉంది.












Click it and Unblock the Notifications