పవన్ పొత్తుల ప్రకటనపై బీజేపీ స్టాండ్ ఇదే-ప్రకటన విడుదల..
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని కీలక ప్రకటన చేశారు. అంతే కాదు ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న బీజేపీని కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని కూడా కలిసి మాట్లాడతానన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై స్పందించిన ఏపీ బీజేపీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో తమ స్టాండ్ ఏంటో బీజేపీ వెల్లడించింది. ఇన్నాళ్లు తాము చెబుతున్న అభిప్రాయానికి తగినట్లుగానే ఈ ప్రకటన కూడా ఉంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు దూరంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు చేసిన ప్రకటన కూడా అదే తరహాలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందనీ పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారని, పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఆ పార్టీ తెలిపింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని వెల్లడించింది. పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయిస్తారని తెలిపింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని తెలిపింది.
తద్వారా ప్రస్తుతానికి తమ స్టాండ్ కేవలం జనసేనతోనే పొత్తని బీజేపీ చెప్పినట్లయింది. అలాగే టీడీపీతో పొత్తు విషయం ఇంకా నిర్ణయించలేదని, దీనిపై తమ అధిష్టానమే నిర్ణయించాల్సి ఉందని క్లారిటీ ఇచ్చినట్లయింది. దీనిపై పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications