టీడీపీ-జనసేనతో పొత్తుపై రేపు బీజేపీ అధికారిక ప్రకటన..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జత కట్టిన విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇంతవరకూ మౌనంగా ఉంటూ వస్తున్న బీజేపీ ఎట్టకేలకు దాన్ని వీడబోతోంది. రేపు టీడీపీ, జనసేనతో పొత్తుపై కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాము పోటీ చేసే స్ధానాలపైనా బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం అధికార వైసీపీతో పొత్తు పెట్టుకోలేని పరిస్దితి బీజేపీది. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీతో అంటకాగిన బీజేపీ..కేంద్రంలో తన అవసరాలు తీర్చుకుంది. అయితే ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం విపక్ష టీడీపీ, జనసేనతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయేమోనన్న భయంతో ఇన్నాళ్లూ టీడీపీ-జనసేనతో పొత్తుపై మౌనంగా ఉంటూ వచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గరపడుతుండటంతో పొత్తుపై ప్రకటనకు సిద్ధమైంది.
రేపు ఢిల్లీ కేంద్రంగా టీడీపీ-జనసేనతో పొత్తును బీజేపీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో తాము పోటీ చేయబోయే సీట్లపైనా క్లారిటీ ఇవ్వబోతోంది. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమికి తమకు 10 ఎంపీ సీట్లు కావాలని బీజేపీ కోరిందని, అయితే ఐదు సీట్ల వరకూ అయితే ఇచ్చేందుకు సిద్ధమని వీరు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు ఎంపీ సీట్లకు పరిమితం కావడంతో పాటు 10 అసెంబ్లీ సీట్ల వరకూ తీసుకునే అవకాశం ఉంది.
బీజేపీ కోరుతున్న ఎంపీ సీట్లలో అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లేదా ఏలూరు వంటి సీట్లు ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే సీట్లలో శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం, పాడేరు, మాడుగుల, కైకలూరు, నరసాపురం, నరసరావుపేట, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, తిరుపతి వంటి సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై రేపు బీజేపీ అధికారికంగా ప్రకటన వస్తే పూర్తి క్లారిటీ రానుంది. అలాగే ఇప్పటికే కలిసి ప్రచారంలోకి దిగిన టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలిసి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications