ఏపీలో కాంగ్రెస్ కార్యాలయాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి...!!
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపించాయి. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసన పైన బీజేపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ నేతలు సైతం ఈ తీరును తప్పు బట్టారు. కాగా.. తాజాగా ఏపీలోని కాంగ్రెస్ కార్యాలయాల పైన బీజేపీ మద్దతు దారులు దాడులు చేయటం సంచలనంగా మారింది.
తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు చొక్కాలు లేకుండా సదస్సు జరుగుతున్న ప్రాంతంలో చేసిన నిరసన.. ఆ తరువాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వ్యవహారం కలకంగా మారింది. ఈ అంశం పైన బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. యూత్ కాంగ్రెస్ తీరును తప్పు బట్టారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో ఉద్రిక్తతకు దారి తీసాయి. ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ యువమోర్చా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. కాగా . గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయంపై రాళ్లు, కోడి గుడ్లతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీవర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసు కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మస్తాన్ వలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్‌లపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తారా అంటూ మండిపడ్డారు.

దాడుల పై షర్మిల సీరియస్
అదే విధంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోడిగుడ్లు, టమోటాలతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, అనుచరులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గేటు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విజయనగరం జిల్లా లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయా న్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతోపాటు పార్టీ కార్యాలయం బోర్డు దగ్ధం చేశారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడుల పైన పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాకోర్టులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications