కర్ణుడిలా వైసీపీ.. ఘోర పరాజయంపై బొత్స షాకింగ్ ..!
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియిర్ నేత, మండలిలో విపక్ష నేత కూడా అయిన బొత్స సత్యనారాయణ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొన్న బొత్స.. వైసీపీ ఓటమిని కర్ణుడి ఓటమితో పోల్చారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన ప్రధాని మోడీ అమరావతి టూర్ పైనా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ.. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఎన్ని తప్పులు చేసినా వాటిపై వైసీపీ విమర్శలు చేస్తే మాత్రం కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని బొత్స ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారని బొత్స గుర్తుచేశారు. కానీ గత 11 నెలల్లో రాష్ట్రంలో కూటమి పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు.
బొత్స వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి అర్జునుడు కాదు..అక్రమార్జనుడు అన్నారు. కర్ణుడితో ఆయనకు పోలికా అని ప్రశ్నించారు. పురాణాలపై అవగాహన లేకనే జగన్ ఓటమిని బొత్స సత్యనారాయణ కర్ణుడి ఓటమితో పోల్చాడన్నారు. జగన్ కర్ణుడు కాదు... అవినీతి, అసమర్థ, నియంత పాలకుడు అన్నారు. ఎన్నికల ముందు ఇలాగే జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకున్నాడని, జనం పూర్తి క్లారిటీతో అయ్యా నువ్వు అర్జునుడువి కాదు... అక్రమార్జునుడువి అని గుర్తుచేసి కూటమికి ఓట్లు గుద్దారన్నారు. బొత్సకు కూడా వాస్తవాలు తెలుసని,మరే పార్టీ కి వెళ్ళలేక అక్కడే ఉండలేక సతమతం అవుతున్నాడన్నారు.












Click it and Unblock the Notifications