బ్రదర్ అనిల్ ఏపీలో కొత్త పార్టీ ఫిక్స్..!! జగన్ నో కాంప్రమైజ్ : తెర వెనుక ఉన్నదెవరు..!!
ఏపీలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. జగన్ లక్ష్యంగా కొత్త అడుగులు పడుతున్నాయి. అందులో ఇప్పటి వరకు సీఎం జగన్ కు రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్నవారు ఒక్కటి అవుతున్నారు. ఇక, ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ సైతం ఏపీలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే సమయంలో...అన్నతో విభేదించి పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే వార్తల నడుమ..ఈ వ్యవహారినికి జగన్ శిబిరం నుంచి స్పష్టత ఇవ్వక తప్పలేదు. జగన్ - షర్మిల మధ్య విభేదాలు లేవని.. ఉన్నది అభిప్రాయ బేధాలే అంటూ చెప్పుకొచ్చారు.

జగన్ పై రాజకీయంగా ఒత్తిడి పెరిగేలా
పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం ఇష్టం లేని జగన్..అక్కడ పార్టీ వద్దని షర్మిలను వారించాంటూ జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల అప్పట్లో స్పష్టం చేసారు. కానీ, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. ఆ తరువాత ఇద్దరూ ఎప్పుడు డైరెక్ట్ గా విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. పలు ఇంటర్వ్యూల్లో సైతం షర్మిల ఎక్కడా జగన్ పైన ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఇటు.. జగన్ క్యాంపు నుంచి షర్మిల కు సంబంధించి వ్యతిరకంగా వ్యాఖ్యానాలు వినిపించలేదు. అయితే, సడన్ గా బ్రదర్ అనిల్ ఏపీలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తొలుత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లితో సమావేశమయ్యారు. సుదీర్ఘంగ చర్చించారు. ఆ సమయంలో ఈ భేటీ కుటుంబ వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలు ఉంటాయని..అవసరమైన సమయంలో వెల్లడిస్తానంటూ అనిల్ చెప్పుకొచ్చారు.

పార్టీ ఏర్పాటు లేదంటూ తొలుత..
ఆ తరువాత విజయవాడలో ఎస్సీ - బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. అప్పుడే తనను జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి వస్తుందని..కానీ, తనకు పార్టీ ఏర్పాటు ఆలోచన లేదంటూ బ్రదర్ అనిల్ చెప్పారు. మరలా.. విశాఖలో క్రిస్టియన్ - బీసీ సంఘాలతో బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేసారు. వీరంతా తన మాట కోసం 2019 లో వైసీపీకి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలో పైరవీ కారులకు పెద్ద పీట వేసారని విమర్శించారు. బీసీ అభ్యర్ధిని సీఎం చేయాలని కోరుతున్నారని..తప్పకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని వారిని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక, అనిల్ నేరుగా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న వర్గాలను దూరం చేసేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది.

వైసీపీ కోసం పని చేసినా గుర్తింపు లేదంటూ
దీనికి కౌంటర్ గా కొన్ని క్రైస్తవ సంఘాల నాయకులు బ్రదర్ అనిల్ పైన ఫైర్ అయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో బ్రదర్ అనిల్ తో సహా షర్మిల - విజయమ్మ అందరూ జగన్ గెలుపు కోసం పని చేసారు. ఇప్పుడు అదే అంశాన్ని తెర మీదకు తెస్తూ.. బ్రదర్ అనిల్ ఏపీలోనూ జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా.. పార్టీ ఏర్పాటు దిశగానే చర్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్రదర్ అనిల్ కు తెర వెనుక జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీల నేతల మద్దతు ఉందని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకు వాదన వస్తోంది.

జగన్ కౌంటర్ స్ట్రాటజీతోనే ముందుకు
జగన్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాలనే బ్రదర్ అనిల్ అమలు చేస్తున్నారని.. కొత్త పార్టీ ఏర్పాటు ఏపీ రాజకీయాల్లో అంత చిన్న విషయం కాదని కొందరు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. బ్రదర్ అనిల్ సైతం ఇదే అంశాన్ని చెప్పారంటూ గుర్తు చేస్తున్నారు. కానీ, సీఎం జగన్ మాత్రం ప్రజల్లో తన బలం తేల్చుకోవటానికే సిద్ద పడుతున్నారు. ఇప్పుడు.. జగన్ ను రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసి వచ్చే ఎన్నికల్లో అధికారం నుంచి దూరంగా చేయటానికే అనేక రకాల తెర ముందు.. వెనుకాల వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా స్పష్టం అవుతుందని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీనిని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications