Uddhav Sena: నిలువునా చీలిన శివసేన..! ఉద్ధవ్ ను మళ్లీ దెబ్బతీసిన షిండే..!
ఊహించినట్లే శివసేన మరోసారి చీలిపోయింది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో గత ఎన్నికలకు ముందు బలంగా ఉన్న శివసేన ను ఏక్ నాథ్ షిండే ఓసారి చీల్చి ఆయన స్ధానంలో సీఎం పీఠం దక్కించుకున్నారు. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో షిండే వర్గం కంటే ఉద్ధవ్ వర్గానికే (Uddhav Sena) జనం ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్ధవ్ సేనను చీల్చేందుకు షిండే వర్గం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ మేరకు సేనకు ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురిని తమవైపు తిప్పుకున్న షిండే వర్గం ఇవాళ అధికారికంగా వారి పార్టీలో చేర్చుకుంది. దీంతో శివసేన మరోసారి చీలిపోక తప్పలేదు.
శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు రెబెల్ లోక్‌సభ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీ పార్లమెంటరీ విభాగంలో చీలిక అధికారికంగా ఖరారైంది. ఢిల్లీలో జరిగిన కీలకమైన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఈ ఆరుగురు ఎంపీలు గైర్హాజరైన ఐదు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో తక్షణ తిరుగుబాటు జరగబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు మాత్రమే ఆ సమావేశానికి హాజరయ్యారు.

జూన్ 17న ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఇవాళ షిండే సమక్షంలో వారి పార్టీలో చేరారు. ప్రస్తుతం శివసేన (యూబీటీ)లో తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా, మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడానికి ఈ రెబెల్ కూటమికి కనీసం ఆరుగురు సభ్యులు అవసరం. తన వర్గంలోకి ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలను చేర్చుకున్న అనంతరం మాట్లాడిన షిండే.. ఈ పరిణామం పార్టీకి ఒక పెద్ద ప్రోత్సాహమని అభివర్ణించారు. ఒక్కరు కాదు, ఈరోజు తనతో ఆరుగురు పులులు ఉన్నారని, ఇవాళ తాము సిక్స్ కొట్టామని తెలిపారు.














Click it and Unblock the Notifications