శివసేన తిరుగుబాటు వేళ మరో ట్విస్ట్..! ఉద్ధవ్ కు తోడుగా రంగంలోకి రాజ్ థాక్రే..!
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్ లో నెగ్గించుకోవడంలో విఫలమైన కేంద్రం.. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని మరోసారి చీల్చి ఎంపీల్ని తమవైపు ఉన్న షిండే శివసేన వర్గంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ శివసేన(యూబీటీ) వర్గానికి రాజ్ థాక్రే అండగా నిలిచారు.
సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే (Raj Thackeray) బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులను చీల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. శివసేన (యూబీటీ) శిబిరంలో ఉన్న 9 మంది లోక్‌సభ సభ్యులలో ఆరుగురు ఎంపీలు పార్టీ ఆదేశించిన విప్‌ను సైతం పక్కనపెట్టి అత్యవసరంగా నిర్వహించిన పార్లమెంటరీ భేటీకి గైర్హాజరయ్యారు.

వీళ్లు పార్లమెంట్ లోపల, వెలుపల పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆందోళనల నడుమ ఈ సంఘటన చోటుచేసుకుంది. గతంలో ఏకనాథ్ షిండే తిరుగుబాటు తరహాలోనే, ఈ పరిణామాలు కూడా పార్టీలో మరో భారీ వైరుధ్యానికి దారితీస్తాయనే ఊహాగానాలు మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సమావేశంలో రాజ్ ఠాక్రే .. అధికార దాహం కోసం కొందరు రాజకీయ నాయకులు విలువలను దిగజారుస్తున్నారని విమర్శించారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభపెట్టే రాజకీయాలపైనే శ్రద్ధ పెట్టడం వల్ల రాష్ట్ర స్థిరత్వం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు అతడు కేవలం జీవచ్ఛవంతో సమానమని గుర్తుచేశారు. ఈ చీలికల కుట్రల వెనుక ఉన్న అసలు శక్తులను ప్రజలు నిశితంగా గమనించాలని పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications