Buget 2024: ఏపీకి నిర్మలమ్మ గుడ్ న్యూస్-అమరావతికి 15 వేల కోట్లు-పోలవరం సహా ప్రాజెక్టులకూ..!
ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ను వెనుకబడిన జార్ఖండ్ తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. దీంతో చాలాకాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం దక్కినట్లయింది.

ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి నిర్మల తెలిపారు. ఈ మొత్తాన్ని వివిధ ఆర్ధిక సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. దేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు కీలకమన్నారు. అలాగే రాష్ట్రానికీ, రైతులకు జీవనాడి అన్నారు. అటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు నిర్మల తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాపై దృష్టిసారిస్తామన్నారు.
అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ ల అభివృద్ధికి కూడా సాయం చేస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో విశాఖ-చెన్నై-ఓర్వకల్లు-బెంగళూరు కారిడార్ కు ప్రోత్సాహం అందిస్తామన్నారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి సాయం అందిస్తామన్నారు. మరోవైపు ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధి చేపడతామని నిర్మల బడ్జెట్ లో తెలిపారు. తద్వారా విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి తగినంత ప్రయోజనం చేకూరబోతోంది.












Click it and Unblock the Notifications