విశాఖపై మరోసారి బుగ్గన కీలక కామెంట్స్-మినీ భారత్ కు రమ్మని తమిళ ఇన్వెస్టర్లకు పిలుపు..
ఏపీలో విశాఖ వేదికగా వచ్చే నెల 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరులో జరిగిన రోడ్ షోలో విశాఖే కాబోయే రాజధాని అంటూ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇవాళ చెన్నైలో రోడ్ షో నిర్వహించిన బుగ్గన..మరోసారి విశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అవకాశాల గురించి చెప్పడానికి అక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలే సాక్ష్యమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. వాళ్ల అనుభవం కన్నా కొత్తగా వివరించాల్సిందేం లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో వచ్చే నెల 3,4 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పెట్టబడిదారుల సదస్సుకు తమిళనాడు సహా పారిశ్రామికవేత్తలకు మంత్రి బుగ్గన ఆహ్వానం పలికారు. చెన్నైలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. తమిళనాడుతో తెలుగువారి బంధం ఈనాటిది కాదన్నారు.

విద్య,వాణిజ్యం పరంగా చెన్నైతో తన కుటుంబానికి సైతం అనుబంధం ఉందని ఆర్ధికమంత్రి బుగ్గన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా, విభజిత ఆంధ్రప్రదేశ్ కు తమిళనాడుతో ఎక్కువ సంబంధాలున్నాయన్నారు. టీ.నగర్ చెన్నైలో తన తాతగారైన(అమ్మగారి నాన్న) ప్రఖ్యాత సినీ దర్శకులు, నిర్మాత చెన్నైలో ఉండేవారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ల మధ్య సరిహద్దులు పక్కన పెడితే భౌగోళిక, సంస్కృతి, ఆచారాలు దాదాపు ఒకేలా ఉండడం వలన కొత్త చోటులా అనిపించదన్నారు.

చరిత్రను గమనిస్తే వ్యాపారవేత్తలెప్పుడూ కొత్త చోటులో సాహసాల వైపు మళ్లుతారని మంత్రి బుగ్గన తెలిపారు. వాణిజ్యం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలలో ఈ పరిస్థితి మరింత ఎక్కువన్నారు. సహజ వనరులు గల ప్రాంతాలే పారిశ్రామికంగా వృద్ధి సాధించాయన్నారు. అందుకు ఉదాహరణే అమెరికా అన్నారు. వందేళ్ల క్రితం ప్రఖ్యాత నగరాలన్నీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అభివృద్ధిపరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. ఒక స్థాయి దాటాకా కూడా అభివృద్ధికి అవరోధాలుంటాయన్నారు. బెంగళూరు, చెన్నై నగరాల్లో పెరిగిన ట్రాఫిక్ ను ఉదహరించారు. ఒక నాడు చదువుకునే రోజులలో స్వేచ్ఛగా నడచిన రహదారుల్లో ఇప్పుడు ప్రయాణం ప్రయాసతో మారడం గమనించవచ్చన్నారు.
పరిశ్రమల స్థాపనకు ప్రాథమికంగా కావల్సిన వసతుల కల్పనలో కీలకమైన భూమి, విద్యుత్, నీరు వంటి వసతులు అందించడం కూడా కష్టమయ్యే పరిస్థితి ప్రస్తుతం కొన్ని నగరాలకు ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఏ ఇబ్బంది లేదని ఎవరైనా చౌకగా, స్వేచ్ఛగా వాణిజ్యం చేసే అవకాశాలు, అపార వనరులకు అక్కడ కొదవలేదన్నారు. 50వేల ఎకరాల పారిశ్రామిక భూమి పోర్టులు, విమానాశ్రయాలు అనుసంధానమై ఉండడం పారిశ్రామికవేత్తలకు ఏపీలో కలిసొస్తుందన్నారు.

ఐటీ , ఫార్మా , పారిశ్రామిక, తయారీ రంగానికి విశాఖ చిరునామాగా మారనుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అన్ని వసతులతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మనుషులున్న చోటు విశాఖ అన్నారు. 11.43 వృద్ధి రేటుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారుతోందన్నారు. రూ.2500 కోట్లతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతిలో ఇప్పటికే సకల సదుపాయాలతో విమానాశ్రయాలున్నాయన్నారు. తయారీ రంగంలో పరిశ్రమల స్థాపనకు కావల్సినవన్నీ ఏపీలో ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, బావనపాడు, కాకినాడ పోర్టుల నిర్మాణం, 5 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ఇన్ లాండ్ వాటర్ వే లతో చౌక రవాణ, సకల సదుపాయాలకు ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.విద్యుత్ పునరుత్పాదక శక్తిలోనూ ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేస్తోందన్నారు. 176 స్కిల్ కాలేజీలు, 26 నైపుణ్య కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. పాలు పంచదారలా తెలుగువారు ఎక్కడున్న స్థానికులతో కలిసిపోతారని, అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశమున్న రాష్ట్రం ఏపీ ఒకటేనన్నారు.












Click it and Unblock the Notifications