'ముఖ్యమంత్రి': బాబుకు గట్టి చురక, ముద్రగడకు చెక్ చెప్పినట్లే!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం సర్కారుకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం నాడు చురకలు అంటించారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు ఎస్డీఎఫ్ పేరిట టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త తరహా నిధుల కేటాయింపును బుగ్గన ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు కాకుండా ఓడిన అభ్యర్థులకు నిధులెలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అధికార పార్టీ సభ్యుల నియోజకవర్గాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు కేటాయించిన ప్రభుత్వం విపక్షానికి చెందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించిందని బుగ్గన ఆరోపించారు. ఈ రూ.50 లక్షలను కూడా ఎమ్మెల్యేలకు కాకుండా టిడిపికి చెందిన నేతలను ఇంచార్జులుగా నియమించి, వారికి కేటాయించిందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేశారు. మొత్తం ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన చంద్రబాబు, టిడిపికి మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు. టిడిపికి మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి సీఎంనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని ఆయన కోరారు.

సాయంత్రం కాపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ
కాపులకు రిజర్వేషన్ల పేరిట భారీ ఉద్యమానికి కార్యచరణ రూపొందించుకున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు చెక్ చెప్పేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలను విజయవాడ పిలిపించుకున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రత్యేకంగా నిర్వహించిన భేటీ ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగా కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్ల కేటాయింపు, కాపు కమిషన్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇకపై ఉద్యమం పేరిట ముద్రగడ ఇచ్చే పిలుపునకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. బొండా ఉమ వాదనతో ఏకీభవించిన కాపు నేతలు ముద్రగడ ఉద్యమాలకు కాస్తంత దూరంగా ఉంటామని ప్రకటించారు.
మరోవైపు, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నేటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు రావాలని సీఎంఓ నుంచి కాపు వర్గ ఎమ్మెల్యేలకు సందేశాలు వెళ్లాయి.
గాయని సుశీలకు చంద్రబాబు అభినందనలు
గిన్నిస్ రికార్డు సాధించిన గాన కోకిల పి సుశీలకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఆరు భాషల్లో 17 వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందన్నారు.
ఆమె గిన్నిస్ రికార్డు నమోదు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వ చంద్రబాబు అన్నారు. ఆరు భాషల్లో సోలో, డ్యూయట్, కోరస్‌లతో కలిపి మొత్తం 17,695 పాటలు పి సుశీల పాడింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె వేలాది యుగళ గీతాలను ఆలపించారు.












Click it and Unblock the Notifications