బాబుకు 'రాజధాని ప్లాట్ల' షాక్: అమరావతికి వస్తా.. మళ్లీ రంగంలోకి పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక రైతులు సోమవారం కలిశారు. పరిహారం, ప్లాట్ల కేటాయింపు పైన తమకు అన్యాయం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు.
విజయవాడ: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక రైతులు సోమవారం కలిశారు. పరిహారం, ప్లాట్ల కేటాయింపు పైన తమకు అన్యాయం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు.
పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి హాయ్‌ల్యాండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన చేనేత గర్జనసభకు వెళ్లారు. పవన్ సత్యాగ్రహ దీక్ష వద్ద 75 మందిచే దీక్ష విరమింప చేశారు.
ఈ సమయంలో ఉండవల్లి, పెనుమాక రైతులు కలిసి చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తాము సర్వం ప్రభుత్వానికి అప్పగించి పూర్తిగా కష్టాల్లో మునిగిపోయామని, తమను ఆదుకోవాలని ఆయనను కోరేందుకు వచ్చామని చెప్పారు.
ఏడాదికి మూడు పంటలు పండే తమ భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకుందని బేతపూడి, ఉండవల్లి, పెనుమాక, లింగాయపాలెం రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పంటలకు సంబంధించిన ఫొటోలు, ఓ విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశారు.
పవన్ వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పవన్ నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకొనేందుకు వచ్చే నెలలో అమరావతికి వస్తానని పవన్ వారికి చెప్పారు.

తెలంగాణ నేత మద్దతు
ఏఎన్‌యూ దగ్గర చేనేత కార్మికులు చేస్తున్న చేనేత సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సంఘీభావం తెలిపారు. చేనేతకార్మికులు సత్యాగ్రహా దీక్ష ఎందుకు చేపట్టారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. చేనేత రంగానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications