బుక్ అయిన కొడాలి నాని: లా స్టూడెంట్ కంప్లైంట్
Kodali Nani: రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం.. దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం- వైసీపీకి మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకూ కేసుల బెడద తప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా కేసులు నమోదయ్యాయి.
దీనికి అక్కడితో బ్రేకులు పడట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. విశాఖపట్నానికి న్యాయ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆ న్యాయ విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసన సభ్యుడిగా, మంత్రిగా ఉన్నత హోదాలో ఉంటూ మీడియా సమావేశాల్లో బాధ్యతారహితంగా వ్యహరించారని, అభ్యంతరకరమైన పదాలను వాడారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై అసెంబ్లీలోనూ అసభ్య పదజాలంతో దూషించారని లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలు వారి పరువు నష్టం భంగం కలిగించాయని, వాళ్ల కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయని అన్నారు. ఓ మహిళగా, న్యాయ విద్యార్థినిగా తాను బాధపడ్డానని, ఆ పదాలు ఇబ్బందిని కలిగించించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బహిరంగంగా ఒకరిని బాడీ షేమింగ్ చేయడం అనేది నేరపూరితమని ఆమె చెప్పారు. ఈ చర్య- యువతపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినట్టయిందనీ అన్నారు. ఆయా చట్టాలకు అనుగుణంగా కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు విషపూరితమైనవని, వాటి పట్ల ఉపేక్షిస్తే ఆన్‌లైన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియాలో అలాంటి సంస్కృతిని ప్రోత్సహించినట్టవుతుందని చెప్పారు. కొడాలి నానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి పదాలను వినియోగించే వారికి ఓ హెచ్చరికను పంపించినట్టవుతుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications