ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం,వెండి, ఉచితాలు, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల నేపధ్యంలో అడుగడుగునా నిఘా
రాష్ట్రంలో వచ్చేనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం, వెండి, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచామన్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా, పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఈడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమరవాణాపై నిరంతరం నిఘా పెట్టామన్నారు.

ఎన్నికల సమయంలో భారీగా పట్టుబడిన నగదు, వస్తువుల విలువ ఇదే
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం, వెండి, ఉచితాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకూ స్వాదీనం చేసుకున్న మొత్తం రూ. 165.91 కోట్ల విలువన్నారు.
అత్యధికంగా అనంతపూర్ లో.. అత్యల్పంగా ఇక్కడే
అత్యధిక మొత్తం రూ.30.66 కోట్లు అనంతపూర్ పార్లమెంటరీ నియోజక వర్గంలోనూ, అత్యల్పంగా రూ.1.15 కోట్లు నర్సాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలోను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకూ స్వాదీనం చేసుకున్న మొత్తం సొమ్ములో రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కరు, రూ.2.78 కోట్ల విలువైన 52,28,218.94 గ్రాముల డ్రగ్స్, రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల బంగారం, వెండి ఉన్నాయన్నారు.
ఎన్నికలు ముగిసేవరకు నిఘా
రూ.2.90 కోట్ల విలువైన 4,88,557 ఉచితాలు మరియు రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా ఎన్నికలు ముగిసే వరకు నిఘా కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.












Click it and Unblock the Notifications