వైఎస్ అవినాష్ కు బెయిల్ ఇవ్వొద్దు-తెలంగాణ హైకోర్టును కోరిన సీబీఐ..సునీత కీలక వాదన..
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వ్యవహారం కూడా అంతే సంచలనం గా మారుతోంది. ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, కాబట్టి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ ఇవాళ తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు వినిపించింది. ఇప్పటివరకూ జరిగిన విచారణలో అవినాష్ తమకు సహకరించలేదని, పొంతన లేని సమాధానాలు ఇచ్చారని సీబీఐ వాదించింది. అలాగే వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారని, ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డిది కీలక పాత్రని సీబీఐ వాదిస్తోంది.

వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆరోపించింది. ఇందుకు తమ వద్ద సాంకేతిక ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. అలాగే ఈ హత్య కోసం రూ.40 కోట్ల డీల్ జరిగిందని, దీనికి సంబంధించి కూడా ఆధారాలు లభ్యమైనట్లు సీబీఐ హైకోర్టుకు వెల్లడించింది. వివేకా హత్య జరిగిన ప్రదేశానికి అవినాష్ రెడ్డి వెళ్లారని, హత్య జరిగిన రోజు సాక్ష్యాల తారుమారులో అవినాష్ ది కీలక పాత్రని సీబీఐ తెలిపింది.
అవినాష్ పై ఇప్పటివరకూ జరిగిన విచారణలో సహకరించకపోవడం, ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ కోరింది. మరోవైపు ఇవాళ జరిగిన విచారణలో సీబీఐ వాదనలు విన్న హైకోర్టు.. ఇదే కేసులో ఇంప్లీడ్ అయిన పిటిషనర్ సునీతా రెడ్డి తరఫు వాదనలు కూడా తీసుకుంది. సునీత తరఫు సీనియర్ కౌన్సిల్ ఎల్ రవిచంద్ వాదనలు వినిపించారు. ఇందులో అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని కోర్టుకు ఇచ్చిన చార్జిషీట్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్‌లోనూ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేలిందన్నారు.

ఎప్పుడు నోటీసు ఇచ్చినా అరెస్ట్ చేయవద్దని అవినాష్ కోర్టును ఆశ్రయిస్తున్నారని సునీత న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.వివేకా హత్య రోజు అవినాష్ రెడ్డి శివ శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చారని, వివేక చనిపోయింది గుండె పోటుతోనే అని తేల్చారన్నారు. గూగుల్ టేక్ ఔట్ సాక్షాలు సరిపోతాయా..? లేవా..? అనేవి విచారణ ఈ దశలో ఉన్నపుడు నిందితుడు తేల్చేది కాదు.. సరైన సమయంలో కోర్టులు పరిశీలిస్తాయని తెలిపారు.
విచారణను అడ్డుకోవదానికే అవినాష్ ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నారన్నారు. సునీతకు, వివేకాకు కన్న కూతురు, వారి మధ్య విబేధాలు లేవన్నారు. ఆంధ్రా నుండి తెలంగాణకు కేసు బదిలీ కావడానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డేనన్నారు. ఏపీలో పలుకుబడి ఉపయోగించి విచారణను తప్పుదోవ పట్టించారని, అందులో అవినాష్ రెడ్డి కూడా ఒకరన్నారు.












Click it and Unblock the Notifications