YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు-సీబీఐకి కీలక ఆదేశాలు...!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఆగస్టు 14న తమ ముందు హాజరు కావాలని సమన్లలో కోర్టు సూచించింది. ఈ మేరకు సీబీఐకి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకూ సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి తొలిసారి సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కు సుప్రీంకోర్టు గత నెల 30 వరకూ గడువు విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అదే రోజు అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో తొలిసారి వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ8గా చేర్చింది. అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఏ6గా, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ7గా కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల్ని ఇవాళ సీబీఐ కోర్టులో విచారణకు సీబీఐ హాజరుపర్చింది. దీంతో వీరందరికీ ఆగస్టు 14 వరకూ కోర్టు రిమాండ్ పొడిగించింది.
వివేకా హత్య కేసులో నిందితులందరినీ తిరిగి ఆగస్టు 14న సీబీఐ కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. దీంతో ఇవాళ హాజరుపరిచిన ఏడుగురితో పాటు ఏ8గా ఉన్న అవినాష్ రెడ్డిని కూడా ఆరోజు హాజరయ్యేలా చూడాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా సమన్లు కూడా జారీ చేసింది. దీంతో ఆగస్టు 14న సీబీఐ కోర్టు చేపట్టే విచారణ కీలకంగా మారింది. ఆ రోజు సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా సీబీఐ తదుపరి అడుగులు ఉండబోతున్నాయి.
మరోవైపు ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి.. తొలిసారి సీబీఐ కోర్టు ముందు హాజరుకాబోతున్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో అనుమానితుడిగా ఉంటూ సీబీఐ విచారణకు హాజరైన అవినాష్.. ఈసారి సీబీఐ కోర్టులో నిందితుడిగా హాజరుకాబోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా సీబీఐకి కీలక ఆదేశాలు ఇచ్చింది. అవినాష్ ను అరెస్టు చేసినా పూచీకత్తుపై బెయిల్ ఇవ్వాలని సూచించింది. దీంతో సీబీఐ లాంఛనంగా అవినాష్ ను అరెస్టు చేసి బెయిల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications