ఏప్రిల్ 27న తేలనున్న జగన్ భవితవ్యం- బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో- రఘురామ పిటిషన్‌పై
అక్రమాస్తుల కేసులో తనపై దాఖలైన సీబీఐ కేసుల్లో బెయిల్‌పై ఉన్న సీఎం జగన్ భవితవ్యం త్వరలో తేలిపోనుందా ? జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది ? ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఉన్న వైఎస్ జగన్ ఏపీలో సీఎంగా ఉండటం, తన పార్టీకే చెందిన రెబెల్ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రాబోతుండటం ఉత్కంఠ రేపుతోంది.

రఘురామ పిటిషన్‌పై విచారణ
సీబీఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయన దాఖలు చేసిన పత్రాలను పరిశీలించింది. జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదంటూ రఘురామ న్యాయవాది వేసిన ప్రశ్నలపై స్పందిస్తూ విచారణ జరిపిన కోర్టు త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతోంది.

ఏప్రిల్ 27న జగన్ భవితవ్యం తేలిపోతుందా ?
అక్రమాస్తుల కేసులో గతంలో తాము ఇచ్చిన బెయిల్‌పై ఉన్న వైఎస్ జగన్ విషయంలో సీబీఐ కోర్టు ఈ నెల 27న నిర్ణయం తీసుకోబోతోంది. గతంలో తాము మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను జగన్ పాటిస్తున్నారా ? ఆయన బెయిల్ కొనసాగించవచ్చా లేదా అన్న దానిపై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. జగన్‌కు గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఇప్పటివరకూ ఎవరూ ప్రశ్నలు లేవనెత్తకపోవడంతో దాదాపు రెండున్నరేళ్లుగా బెయిల్‌పై ఉన్న జగన్‌కు ఇప్పుడు రఘురామకృష్ణంరాజు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రఘురామ వ్యక్తం చేసిన అభ్యంతరాల్ని పరిశీలించి సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది.

తీర్పు అనుకూలంగా వస్తుందని రఘురామ ధీమా
వైసీపీ అధినేత కమ్ సీఎంగా కూడా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ కేసులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత వీడియో విడుదల చేసిన రఘురామ.. ఏప్రిల్ 27న తీర్పు అనుకూలంగా వస్తుందని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. కోర్టు పరిదిలో ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు.

జగన్ బెయిల్ కొనసాగుతుందా ?
అక్రమాస్తుల కేసులో జగన్‌కు గతంలో సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో జగన్‌కు బెయిల్ ఇచ్చింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆర్దిక నేరాల కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేయాలని హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఎల్లుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో గతంలో జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్న తెలంగాణ హైకోర్టు జగన్ బెయిల్‌కు సంబందించి సీబీఐ కోర్టులో విచారణ కూడా వేగవంతం చేయాలని కోరుతుందా ? లేక ఎలాగో విచారణ పూర్తవుతుంది కాబట్టి బెయిల్‌పై ఇప్పుడు చర్చ అనవసరమని చెప్తుందా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications