రఘురామ రాజుపై సీబీఐ ఛార్జ్ షీట్ - 16 మందితో సహా : రుణాల ఎగవేత కేసులో..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పైన సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆయనతో పాటుగా 16 మంది పైన సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఆర్దిక సంస్థల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని .. ఎగ వేత కేసులో ఈ ఛార్జ్ షీట్ దాఖలైంది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. దీని పైన విచారించిన సీబీఐ ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనే దాని పైన పూర్తి వివరాలను వెల్లడించింది.

రఘరామరాజుతో సహా 16 మందిపై
రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 అక్టోబర్ 3న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రయివేటు కంపెనీ ..దాని డైరెక్టర్ల పైన ఢిల్లీలో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019, ఏప్రిల్ 29న కేసు నమోదు చేసింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

రుణాలు తీసుకొని ఎగవేత
తమిళనాడులోని ట్యూటికోరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు.

నష్టపోయిన ఆర్దిక సంస్థలు
ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించి...ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో.. బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటుగా యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి.

సీబీఐ వివరాల వెల్లడి
ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం మోస పోయింది. ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ నిర్దారణకు వచ్చింది. రఘురామ రాజుతో పాటుగా ఇండ్ భారత్ పవర్, డైరెక్టర్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్‌రెడ్డి తో సహా మొత్తం 16 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక, ఇదే సమయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎంపీ రాఘురామ కృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది.

అక్కడ కూడా అభ్యర్దన తిరస్కరణ
వివిధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ కంపెనీ మొత్తం రూ. 1383 కోట్ల రుణం తీసుకుంది. అయితే రికవరీ కోసం ఢిల్లీలోని డెబిట్ ట్రిబ్యునల్‌ను బ్యాంకుల కన్సార్షియం అశ్రయించింది. రూ.1327 కోట్ల అప్పులకు గాను తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 872 కోట్లే ఉంది. దివాళా అయిన కంపెనీ పరిష్కార ప్రక్రియ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది.
దివాలా ప్రక్రియకు అనుమతించవద్దంటూ రఘురామ కంపెనీ వాదించింది. ఆ వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి.. దివాలా ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దివాలా పరిష్కార నిపుణుడిని నియమించి, మూడు రోజుల్లో దివాలా ప్రక్రియ గడువుతో సహా వివరాలన్నీ తెలియజేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications