వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డిని విచారించిన సీబీఐ: స్టేట్‌మెంట్‌లో కీలకాంశాలు: రేపో, మాపో
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు.
ఇదే కేసులో సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టయిన మరుసటి రోజే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు. ఇదివరకు రెండు, మూడుదఫాలుగా ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు.

ఈ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం కావడం, వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు రాత్రే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం చర్చనీయాంశమైంది. ఆయనను విచారించడం ఇదే తొలిసారి. ఈ కేసులో దీన్ని అనూహ్య మలుపుగా భావిస్తోన్నారు.
వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్ విషయంలో విభేదాలు తలెత్తడం, ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. వివేకాను హత్యచేయించారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్న నేపథ్యంలో- నర్రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
ఆయన విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌లో వాటిని పొందుపర్చారు. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడం, ఆ దంపతులకు బాబు పుట్టడం, ఆస్తిని రాసివ్వాలనుకోవడం.. వంటి కోణంలో సీబీఐ అధికారులు ఇక తమ దర్యాప్తును మొదలు పెట్టారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
రెండో పెళ్లి విషయంలో వివేకా కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహంతో ఉండటం, తండ్రితో గొడవపడటం, షమీమ్‌కు బెదిరింపులు, ఆమెతో చేసినట్లుగా అనుమానిస్తోన్న వాట్సప్ ఛాటింగ్.. ఆయా అంశాలన్నింటినీ కూడా సీబీఐ అధికారులు తమ దర్యాప్తులో పరిగణనకు తీసుకున్నట్లు తెలుస్తోంది. షమీమ్ చేసిన ఆరోపణల కోణంలో కూడా వారు దర్యాప్తు మొదలు పెట్టారని అంటున్నారు.












Click it and Unblock the Notifications