ys vivekananda reddy : వైఎస్ కుటుంబంపై సీబీ'ఐ'- మొదలైన విచారణ-అంతా గప్ చుప్
ఏపీలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడైన సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో సీబీఐ దర్యాప్తు రూటు మారింది. అప్పటివరకూ చిన్నా చేపలపై దృష్టిపెట్టిన సీబీఐ.. ఒక్కసారిగా రూటు మార్చింది. ఇప్పుడు ఏకంగా వైఎస్ కుటుంబంపై ఫోకస్ పెట్టేసింది. ఇప్పటికే వైఎస్ వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిని పిలిపించి విచారించిన సీబీఐ. మరికొందరు కుటుంబ సభ్యుల్ని కూడా రప్పించేందుకు సిద్ధమవుతోంది.

వివేకా హత్య-అనంతర పరిణామాలు
2019లో జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విపక్షంలో ఉన్న వైసీపీని సైతం ఇరుకునపెట్టింది. ఎంతగా అంటే హైకోర్టుకు వెళ్లి ఈ హత్యపై ఎవరూ మాట్లాడకుండా వైసీపీ ఆదేశాలు తెచ్చుకునేటంతగా ఈ హత్య అప్పటి రాజకీయాల్ని ప్రభావితం చేసింది. వివేకా హత్య తర్వాత వైఎస్ కుటుంబ సభ్యుల వ్యవహారశైలి కూడా దీనికి ఆజ్యం పోసింది. వివేకా హత్యను అడ్డుపెట్టుకుని జరిగిన రాజకీయాలు అయితే అన్నీ ఇన్నీ కావు. విపక్షంలో ఉండగా వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోరిన వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్... అధికారంలోకి వచ్చాక మాత్రం దీనిపై మౌనంగా ఉండిపోయారు. దీంతో అనుమానాలన్నీ వైఎస్ కుటుంబంపైకి మళ్లాయి.

హత్యను గుండెపోటుగా మార్చి
వివేకానందరెడ్డి హత్య అర్ధరాత్రి జరిగితే ఉదయం కల్లా అక్కడ ఆధారాలన్నీ మాయం అయ్యాయి. రక్తపు మరకలు కడిగేయటంతో పాటు ఇతర ఆధారాల్నీ మాయం చేసేశారు. ఉదయం వివేకా గుండెపోటుతో చనిపోయారన్న వార్తలు టీవీల్లో కనిపించాయి. చివరికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తన పెదనాన్న వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అప్పటికీ పోలీసుల్ని కానీ, ఇతరుల్నికానీ వైఎస్ కుటుంబం వివేకా ఇంట్లోకి వెళ్లనీయలేదు. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న కుమార్తె సునీతారెడ్డికి సైతం ఆయన గుండెపోటుతోనే చనిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇంటి వాచ్ మెన్, ఇతర అనుచరులు పోలీసు స్టేషన్ కు వెళ్లి వాస్తవాలు చెప్పేయడంతో ఆయన దారుణ హత్యకు గురయ్యారనే విషయం ప్రపంచానికి తెలిసింది.

సునీతారెడ్డి సంచలనాలు
వైఎస్ వివేకా హత్య వరకూ సునీతారెడ్డి పేరు అంతగా ఎవరికీ తెలియదు. కానీ వివేకా హత్య తర్వాత వైఎస్ కుటుంబం వ్యవహారశైలితో సునీతారెడ్డి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. ముఖ్యంగా వివేకా హత్య తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులు తనకు వాస్తవాలు చెప్పకపోవడంతో ఏదో అవాంఛనీయ ఘటన జరిగిందని ఆమెకు అర్దమైంది. దీంతో ఆమెతో పాటు వైఎస్ కుటుంబమంతా సీబీఐ దర్యాప్తు జరిపించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ సర్కార్ సీబీఐ విచారణ జరిపించేలోపు ఎన్నికలు రావడం టీడీపీ స్ధానంలో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ కూడా సీబీఐ దర్యాప్తు డిమాండ్లను పట్టించుకోలేదు. దీంతో సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ కుటుంబంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది.

నత్తనడకన సీబీఐ దర్యాప్తు
వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ నత్తనడకన విచారణ కొన సాగించింది. మధ్యలో కరోనా రావడంతో సీబీఐ అధికారుల బృందం ఢిల్లీ వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా దర్యాప్తు ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సీబీఐ దర్యాప్తు నిజనిజాలు నిగ్గుతేల్చడంపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ దశలో ఎందుకో కానీ సీబీఐ జోరు పెంచింది. వరుసగా వివేకా ఇంటి వాచ్ మెన్, డ్రైవర్, ఇతర అనుచరుల్ని వరుసగా పిలిపించి విచారించడం మొదలుపెట్టింది. వీరితో పాటు వందలాది మంది సాక్ష్యుల్ని కూడా విచారించింది. ఈ క్రమంలో వివేకా ఇంటి వాచ్ మన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ కుమార్ యాదవ్ అనే నిందితుడ్ని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టింది. ఇంకా ఆ దర్యాప్తు కొనసాగుతోంది.

వాచ్ మెన్ రంగన్న సంచలన ట్విస్ట్
నత్తనడకన సాగుతున్న సీబీఐ దర్యాప్తులో జోరు పెరిగింది వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న సంచలన వాంగ్మూలంతోనే . జమ్మలమడుగు కోర్టులో రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో మొత్తం 9 మంది వరకూ వివేకా హత్యలో ప్రత్యక్షంగా , పరోక్షంగా పాలుపంచుకున్నారని చెప్పాడు. ఇందులో ఇద్దరు వీఐపీలు కూడా ఉన్నారని చెప్పాడు. దీంతో ఈ విచారణలో ఇది భారీ ట్విస్టుగా మారింది. ఈ వీఐపీలు ఎవరన్న దానిపైనా చర్చ మొదలైంది. ఈ దశలో సునీల్ యాదవ్ అనే నిందితుడిని సీబీఐ అరెస్టు చేసింది. కోర్టు సాయంతో కస్టడీలోకి తీసుకుంది. ఆయన ఇంట్లోనూ సోదాలు చేపట్టింది. దీంతో సునీల్ కుటుంబం సీబీఐ తీరుపై విమర్శలు మొదలుపెట్టింది.

వైఎస్ కుటుంబాన్ని ఇరుకునపెట్టిన సింహం డైలాగ్
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, పెద్ద చేపట్ని వదిలిపెట్టి సునీల్ యాదవ్ వంటి చిన్న చేపల్ని టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన సోదరుడు కిరణ్ యాదవ్ చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సింహాన్ని సింహమే చంపుతుంది కానీ చిట్టెలుక కాదంటూ కిరణ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు రేకెత్తించాయి. దీంతో వైఎస్ కుటుంబం కూడా ఇరుకునపడింది. గతంలో సునీతారెడ్డి తన తండ్రి వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబంపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఇప్పుడు కిరణ్ యాదవ్ కూడా వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించడంతో సాధారణ ప్రజలకు తెలిసన విషయాల్ని కూడా సీబీఐ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అయ్యాయి.

వైఎస్ కుటుంబంపై సీబీఐ ఫోకస్
వివేకా హత్య కేసులో అసలు నిందితుల్ని వదిలిపెట్టి సునీల్ యాదవ్ తో పాటు మరికొందరు చిన్న నిందితుల్ని వేధిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఇప్పుడు వైఎస్ కుటుంబంపై ఫోకస్ పెట్టింది. దీంతో సీబీఐ పిలుపు మేరకు నిన్న వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే వీరితో ఈ విచారణ ఆగేలా లేదు. వివేకా హత్య జరిగిన తర్వాత కీలకంగా వ్యవహరించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ త్వరలో విచారించబోతోంది. వైఎస్ కుటుంబంలో మరికొందరిపైనా సీబీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సీబీఐ దర్యాప్తుపై వైఎస్ కుటుంబం స్పందన ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో యూపీఏ హయాంలో వైఎస్ జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టినప్పుడు సీబీఐ తమను వేధిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన వైఎస్ కుటుంబం ఇప్పుడు వివేకా కేసులో దర్యాప్తు నేపథ్యంలో తమను ప్రశ్నించడంపై మాత్రం మౌనంగా ఉంటోంది. దీంతో సీబీఐ టార్గెట్ ఎట్టకేలకు వైఎస్ కుటుంబంపైకి మళ్లిందా అన్న ప్రచారం జరుగుతోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications