ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే లైన్ ప్రకటించిన నరేంద్రమోడీ
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధానంగా రైల్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వరాలజల్లు కురిపిస్తోంది. గతంలోనే ఉన్న గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవగా, రాజధాని అమరావతికి కొత్తగా నిర్మించే అమరావతి-ఎర్రుపాలెం రైల్వే లైనులో కదలిక వచ్చింది. దీనికి సంబంధించిన పనులు పర్యవేక్షించేందుకు అధికారులను కూడా నియమించారు. తర్వాత రేణిగుంట నుంచి సీఆర్ఎస్ నగర్ మధ్య కొత్త రైల్వే లైను నిర్మించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది.
తిరుపతి-రేణిగుంట రద్దీని తగ్గించేందుకు
తిరుపతికి సమీపంలోని రేణిగుంట అతి పెద్ద రైల్వే జంక్షన్. రోజురోజుకు రైళ్ల రాకపోకలు తీవ్రంగా పెరుగుతుండటంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు కూడా సరిపోవడంలేదు. అలాగే రైళ్లకు ఏవైనా మరమ్మతులు చేయాలంటే వీటిని సీఆర్ఎస్ కు తీసుకువెళ్లడానికి కూడా కుదరనంత రద్దీ ఉండటంతో కొత్త రైల్వే లైను నిర్మించాలని అధికారులు భావించారు. రేణిగుంట సమీపంలోని సీబీఐడీ కాలనీ దగ్గర గూడ్స్ షెడ్డు ఏర్పాటు చేయనుండటంతో ఈ పనులకు కేంద్రం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదు.

తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు
ఈ లైనుతోపాటు విజయవాడ నుంచి గూడూరు మధ్య మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆరు రోజులపాటు విశాఖపట్నం నుంచి కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ ప్రెస్ ను ఆగస్టు ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు, కడప నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల రైలును ఆగస్టు ఆరో తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేశారు. వీటితోపాటు విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో ఆగవని అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications