చంద్రబాబు ఇది విన్నారా..! ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకంటున్నారు
ఢిల్లీ : ఎలాగైనా సరే.. ఏపీకి ప్రత్యేక హోదా తీస్తుకొస్తామని, కేంద్రంలో ఉన్నది తమ మిత్రపక్షమేనని చెప్పుకుంటూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కేంద్రమంత్రి హరీభాయి చౌదరి. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ.. ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించగా..! ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటున్నందున ఏపీకి ప్రత్యేక హోదా అసలు అవసరమే లేదని తేల్చేశారు కేంద్రమంత్రి హరిభాయి.
విభజన చట్టంలో పేర్కొన్న హామీలలో ప్రతీ ఒక్క హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పిన హరీభాయి.. ఆర్థికంగా ఏపీని ఆదుకుంటుండడంతో పాటు పది జాతీయస్థాయి విద్యా సంస్థలను ఏపీకి కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీకి ఏం అవసరమనేది విభజన చట్టంలో స్పష్టంగా పొందుపర్చారని, వాటన్నింటిని అమలుపరుస్తున్నందున ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్పిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.

ఇప్పటికే ఏపీకి దాదాపు 90 వేల కోట్ల ఆర్థిక కేటాయింపులు జరిగాయని చెప్పుకొచ్చిన హరీభాయి.. హామీలపై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను తప్పుబట్టారు. విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మే 4న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం కోసం గత రెండేళ్లలో 2.5వేల కోట్లు, పోలవరం ప్రాజెక్గుకు 850 కోట్లు మంజూరు చేశామని రాబోయే రెండేళ్ళలో మరో 7.1 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పారు కేంద్రమంత్రి చౌదరి.
పలు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మంత్రి.. రాజధాని అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల రింగు రోడ్డుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమైందని చెప్పారు. అలాగే రాజధానిలో హైకోర్టు ఏర్పాటుకు, తిరుపతిలో ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, కర్నూలులో ఐఐటి ఏర్పాటుకు, విశాఖలో ఐఐఎం, ఐఐపి, గోదావరి జిల్లాల్లో ఎన్‌ఐటి, అనంతపురంలో సెంట్రల్ వర్శిటీ ఏర్పాటుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications