సినిమా వాళ్ల పొట్ట కొట్టి..భయపెట్టి : ఇండస్ట్రీపై కక్ష్యతో ఇలా - సీఎంపై చంద్రబాబు సంచలనం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్‌కు సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదని చంద్రబాబు విమర్శించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి వలన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. చరిత్రలో ఎవరూ చేయని నష్టం జగన్ చేశారన్నారు. జగన్ పాలనలో రాజ్యంగ వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని.. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మేధావులు, యువత.. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. జగన్ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.

రాష్ట్రం పతనావస్థలోకి వెళ్తోంది
వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకుందని.. ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతోందని చంద్రాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి చెత్త పైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని.. ఆఖరికి ప్రైవేటు ఆస్తులనూ తాకట్టు పెడతారని ఎద్దేవా చేశారు. జగన్ చేసే అప్పులు ఆకాశం నుంచి వచ్చి ఎవ్వరూ కట్టరని.. రాష్ట్ర ప్రజలే కట్టాలని.. ఈ అంశంపై ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వైకాపా సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఆంధ్రప్రదేశ్ పతనావస్థలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో జరిగిన చర్చల పైన చంద్రబాబు స్పందించారు.

సినిమా వాళ్ల పొట్ట కొట్టి..భయపెట్టారు
తాను తొలి సారిగా 40 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసానని.. 14 ఏళ్లు సీఎంగా పని చేసానని..కానీ, సినిమా వాళ్లతో కూడా ఇలా చేయవచ్చని తనకు తెలియదని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో వీళ్లే సమస్యను క్రియేట్ చేసి..వాళ్ల మధ్య కలబెట్టి.. పరిష్కారం పేరుతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్ష్యతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి పెద్ద నాయకుడా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లు తమ పని తాము చేసుకుంటూ ఉంటారని..అటువంటి వాళ్లతో ఇలా వ్యవహరిస్తారా అని తనకే సందేహం వచ్చిందని చెప్పారు.

ఇండస్ట్రీపై కక్ష్యతోనే ఇలా చేస్తున్నారు
వారి పొట్ట మీద కొట్టి..భయ బ్రాంతుకులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఉద్యోగులు..ఇప్పుడు సినీ పరిశ్రమతోనూ ఇదే విధంగా వ్యవహరించారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో జగన్‌రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications