కృష్ణ సోదరుడుకి చంద్రబాబు సీటు ఖరారు - మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ టీడీపీకేనా..!!
ఏపీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. జగన్ ఓటమే లక్ష్యంత జత కట్టిన టీడీపీ, జనసేన ఇప్పుడు పోటీ చేసే అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. బీజేపీ పొత్తు అంశం పైన స్పష్టత వచ్చిన తరువాత ప్రకటనకు సిద్దమవుతున్నాయి. ఇదే సమయంలో దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు టీడీపీ అభ్యర్దిగా పోటీ చేయనున్నారు. చంద్రబాబు ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్కడ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకం మారుతోంది.
మారుతున్న లెక్కలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్దుల పైన స్పష్టత ఇచ్చారు. వైసీపీ నుంచి నేతలు పార్టీలోకి వస్తున్న వేళ ముఖ్యమైన సీట్ల విషయం లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ జిల్లాలో సీట్ల విషయంలో అనేక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అక్కడ పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నూజివీడు అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరటం ఖాయమైంది. ఈ సమయంలో పెనమలూరు నుంచి కొత్త అభ్యర్దిని చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు టీడీపీ అభ్యర్దిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన ఆదిశేషగిరి రావు టీడీపీలో చురుగ్గా ఉంటున్నారు.

ఆదిశేషగిరి రావుకు సీటు
తాజాగా చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరి రావు తాను పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసారు. చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత సినీ రంగం నుంచి ఆదిశేషగిరి రావు తొలిగా స్పందించి ఖండించారు. ఆదిశేషగిరి రావు పోటీ చేయటం ద్వారా కృష్ణ , మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. నాడు నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆదిశేషగిరి రావు మహేష్ ఫ్యాన్స్ తో సమావేశమై పార్టీకి అనుకూలంగా పని చేసేలా ఒప్పించారు. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆదిశేషగిరి రావు పేరు తెర పైకి వచ్చింది.
ఉమా - బోడే ప్రసాద్ సీట్లు ఎక్కడ
ప్రస్తుతం పెనమూలూరు టీడీపీ ఇంఛార్జ్ గా బోడే ప్రసాద్ ఉన్నారు. మైలవరం టీడీపీలో మారుతున్న సమీకరణాలతో అక్కడ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే వసంత క్రిష్ట ప్రసాద్, దేవినేని ఉమా మధ్య పోటీ నెలకొంది. చంద్రబాబు ఇద్దరిలో ఎవరికి సీటు ఇస్తారనేది అధికారికంగా స్పష్టత రాలేదు. వసంతకు మైలవరం సీటు ఇచ్చి, దేవినేని ఉమాను పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం బోడే ప్రసాద్ కు సీట్ల లేనట్లేనని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు పెనమలూరు నుంచి ఆదిశేషగిరి రావుకు సీటు ఖాయమని చెబుతున్న సమయంలో..దేవినేని ఉమా, బోడే ప్రసాద్ పోటీ పైన సందిగ్ధత కొనసాగుతోంది. మైలవరం, పెనమలూరు విషయంలో చంద్రబాబు నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications