అయిదుగురు సీనియర్లకు సీట్లపై తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. పార్టీ మేనిఫెస్టో కూడా ఖరారు కావటంతో టికెట్ల ఖరారు పై ఫోకస్ చేసారు. సీనియర్లకు తన వైఖరి స్పష్టం చేస్తున్నారు. పొత్తుల పైన ఒక వైపు మంతనాలు కొనసాగిస్తూనే...నియోజకవర్గాల వారీగా సమీక్షలు తిరిగి ప్రారంభించారు. అందులో భాగంగా నలుగురు సీనియర్లకు చంద్రబాబు వారి నియోజకవర్గాల్లోని పరిస్థితులపై చర్చించి..సీట్ల ఖరారు పైన క్లారిటీ ఇచ్చారు. మేనిఫెస్టో ప్రచారం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.
సిద్దంగా ఉండండి:ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తాయని తాపీగా కూర్చోవద్దని సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని అలర్ట్ చేసారు. వాటికి సంబంధించి కదలికలు కనిపిస్తున్నాయని వివరించారు. ఎక్కడైనా ఎవరితోనైనా సమస్యలున్నా.. విభేదాలున్నా వాటిని పరిష్కరించుకోవాలని నిర్దేశించారు. అయదు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో చంద్రబాబు సమావేశమయ్యారు. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట)లతో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఉపేక్షిస్తే సహించేది లేదు:నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిపై తనకు అందిన సమాచారం, వివిధ సర్వేల్లో వచ్చిన ఫలితాలను ఆయన వివరించి.. ఇంకా ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో వారితో చర్చించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఎవరినీ వదులుకోవటానికి సిద్దంగా లేనని చెప్పుకొచ్చారు. బాగా పనిచేస్తే తన ప్రోత్సాహం ఉంటుందన్నారు. పనిచేయకుండా వెనుకబడిపోతే తాను మరొకరిని వెతుక్కోవాల్సి ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని... అదే సమయంలో పనిచేయకపోతే కూడా ఊరుకోనని స్పష్టం చేసారు. అవసరమైన చోటు ఒక అడుగు తగ్గి అందిరనీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని నిర్దేశించారు. మహిళ్లాలోకి మరింతగా తీసుకోళ్లాలని చంద్రబాబు సూచించారు.
మేనిఫెస్టోకు ప్రచారం:మహానాడులో భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట ప్రకటించిన టీడీపీ మినీ మేనిఫెస్టోను చంద్రబాబు నియోజకవర్గ పరిశీలకులతో చర్చించనున్నారు. గురువారం ఇన్‌చార్జులతో సమావేశమైనప్పుడు.. ఈ మేనిఫెస్టోపై ప్రజల స్పందనేంటో ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. జనంలోకి బాగానే వెళ్లిందని, టీడీపీ శ్రేణులు ఎవరికి వీలైన పద్ధతిలో వారు వాటిని ప్రచారం చేస్తున్నారని వారు చెప్పారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రయత్నం చేయాలని, ఫీడ్ బ్యాక్ ఏమిటో కూడా తనకు చెప్పాలని చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ సీటు కీలకంగా భావిస్తున్న చంద్రబాబు.. గతం కంటే భిన్నంగా నేతలకు తన అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. దీంతో, ఇంఛార్జ్ లుగా ఉన్నంత మాత్రాన వారికే సీటు వస్తుందనే నమ్మకం కంటే..పని చేసిన వారికే సీటు ఇచ్చే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications