జగన్ పై పోరాటానికి కలసి రావాలి - పార్టీలకు చంద్రబాబు పిలుపు : పొత్తుల కోసం కొత్త అడుగులు..!
ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పాత మిత్రులతో తిరిగి పొత్తుల దిశగా ఓపెన్ గా ఆహ్వానం పలుకుతున్నారు. కార్యకర్తల నుంచి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలంటూ వచ్చిన ప్రతిపాదన పైన చంద్రబాబు స్పందించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఇదే సమయంలో చంద్రబాబు దీనికి కొనసాగింపుగా ఈ రోజు సైతం మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

ధర్మపోరాటంలో కలిసి రండి
జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన పోవాలంటే ధర్మపోరాటం తప్పనిసరని.. టీడీపీ ఇప్పుడు అదే చేస్తోందన్నారు. ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలసి రావాలని పిలుపిచ్చారు. పొత్తులు ఉన్నప్పుడు గెలిచామని, లేనప్పుడూ గెలిచామన్నారు. ఓటీఎస్‌లాగా జగన్‌కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్లు అని.. వాళ్లకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. పొత్తులపై వైసీపీ నేతలవి పనికిమాలిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని చంద్రబాబు వివరించారు.

కలిసొచ్చేదెవరు..స్పందించేదెవరు
ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితి దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, చంద్రబాబు పొత్తుల గురించి చేసిన ప్రతిపాదన పైన జనసేన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం చంద్రబాబు అవకాశవాది అంటూ.. అవసరమైతే ఎవరి పైనైనా లవ్ పుట్టుకొస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేసారు. ఇక, కొద్ది రోజుల క్రితం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు.. శాసన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సైతం పొత్తుల గురించి చెప్పుకొచ్చారు. టీడీపీ - జనసేన - వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేసారు.

జనసేన మా మిత్రపక్షం
ఇక, బీజేపీ మాత్రం జనసేన తమ మిత్రపక్షమని వాదిస్తోంది. కానీ, జనసేన మాత్రం తాము బీజేపీతోనే బంధం కొనసాగిస్తారా లేదా తిరిగి టీడీపీతో జత కలుస్తారా అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు కోసం చర్చలు జరిపారు. ఇప్పుడు కుప్పం వేదికగా జనసేనానికి లవ్ ప్రతిపాదన చేసారు. ఈ సమయంలో వైసీపీ మాత్రం పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది.

పవన్ సిద్దమేనా.. ముందుకొస్తారా
చంద్రబాబు.. పవన్ కళ్యాణ్..వామపక్షాలు కలిసి పొత్తు పెట్టుకుంటాయని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ - జనసేన పొత్తు మధ్య బీజేపీ కీలకంగా మారుతోంది. చంద్రబాబు బీజేపీతో సైతం మైత్రి కావాలని కోరుకుంటున్నారు. అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం అందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఇక, రానున్న రోజుల్లో పార్టీల మధ్య పొత్తుల పరంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications