అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ - ఇక తేల్చుడే, కీలక నిర్ణయాలు..!!
ఏపీలో పొత్తు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్దమైంది. అధికారిక ఎంట్రీ మిగిలి ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ మరో సారి భేటీ అయ్యారు. సీట్ల పంపకాల పైన తమ ప్రతిపాదనలు అందించారు. బీజేపీ ఏపీ నుంచి ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. పొత్తుల్లో భాగంగా రెండు పార్టీలకు 8 ఎంపీ - 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్దత వ్యక్తం చేసారు.
కీలక భేటీ : ఢిల్లీ కేంద్రంగా ఏపీ పొత్తుల రాజకీయం కొనసాగుతోంది. మరో సారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు పైన ఇద్దరు నేతలు చర్చించారు. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీ చేరటం ఖాయమైంది. సీట్ల గురించి తేలిన తరువాత అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ తొలుత 4 ఎంపీ -9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు ప్రతిపాదించింది. కానీ, బీజేపీ నుంచి 10 స్థానాలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది. అనేక తర్జన భర్జనల తరువాత 8 ఎంపీ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. 10-12 అసెంబ్లీ స్థానాల పైన ముందుకు వచ్చినట్లు పార్టీ నేతల సమాచారం.

సీట్ల పై కసరత్తు : ఇప్పుడు అమిత్ షా తో భేటీ సమయంలో ఇదే తరహాలో సీట్ల కేటాయింపు పైన చర్చలు సాగుతున్నాయి. అవసరమైతే పవన్ తనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో ఒక సీటు తగ్గించుకోవటానికి సిద్దపడ్డారని ప్రచారం సాగుతోంది. బీజేపీ ఏపీలో కొన్ని పార్లమెంట్ స్థానాల పైన పట్టుబడుతోంది. విశాఖ, విజయవాడ వంటి నియోజకవర్గాలను కేటాయించేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని తెలుస్తోంది. అయితే, బీజేపీ నుంచి వస్తున్న ఒత్తిడితో విశాఖ సీటు ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. విజయవాడ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానికంగా తమకు ఉన్న ఇబ్బందులు..పార్టీలకు గెలుపు అవకాశాల పై సర్వే నివేదికలతో చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. పొత్తు ఉండాలని కోరుకుంటుండటంతో అనుకున్న సంఖ్యకు అటు ఇటుగా ఒప్పందం జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఫైనల్ నిర్ణయం : ఎంపీ స్థానాల విషయంలో పట్టు బడుతున్న బీజేపీ..ఎమ్మెల్యేల స్థానాల విషయంలో మాత్రం వెసులబాటు ధోరణితో ఉంది. ఈ రోజు చర్చల్లో అన్నీ అనుకూలిస్తే ఎన్డీఏలో చేరిక పైన ప్రకటన రానుంది. వచ్చే వారం కొత్త మిత్రులను ఆహ్వానించి ఎన్డీఏ సమావేశం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అదే విధంగా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోగానే సీట్లు..పొత్తుల పైన కసరత్తు పూర్తి చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications