Nara Lokesh : లోకేష్ ప్లాన్ సూపర్ సక్సెస్- టీడీపీ శ్రేణులకు చంద్రబాబు కీలక సూచన..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించేందుకు టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పేరుతో చేస్తున్న ఈ పాదయాత్రలో లోకేష్ ఓ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇది కాస్తా విజయవంతం కావడంతో ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా దాన్ని అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై చంద్రబాబు నిన్న విశాఖలో కీలక సూచన చేశారు.
నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఇప్పుడు పలు నియోజకవర్గాలను దాటి విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సాధారణ పాదయాత్రల తరహాలో కాకుండా విన్నూత్నంగా ఓ ప్లాన్ అమలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్ధాపించి ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్న పలు కంపెనీల వద్దకు వెళ్లి వాటి ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీన్ని ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు.

నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సంస్ధల ఫొటోలతో విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా లోకేష్ విసురుతున్న సవాళ్లకు వైసీపీ నేతల వద్ద సమాధానం లేకుండా పోతోంది. ఇదే అదనుగా లోకేష్ మరిన్ని ఛాలెంజ్ లు సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్ర పొడవుగా టీడీపీ గతంలో తీసుకొచ్చిన సంస్ధలు, ఏర్పాటు చేసిన పార్కులు, వివిధ అభివృద్ధి పథకాలను సెల్ఫీ ఛాలెంజ్ ల రూపంలో వైసీపీ సర్కార్ కు చూపించే అవకాశం ఉంది.
దీనిపై నిన్న విశాఖలో జరిగిన టీడీపీ జోనల్ సమావేశంలో ఆయన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ లు చూస్తున్నారా అని పార్టీ శ్రేణుల్ని, నేతల్ని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చేసిన పనుల్ని గుర్తుచేస్తూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని, మీరు కూడా అదే తరహాలో ఫొటోలు దిగుతూ సెల్ఫీ చాలెంజ్ లు విసరాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications