అసత్యాలని వాళ్లే: జగన్ పార్టీపై బాబు, భజన: శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రతిపక్షం చెప్పేవన్నీ అసత్యాలేనని వాళ్లే నిరూపించుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శాసన సభలో చెప్పారు. రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, వారి సమస్యలు చూసే రుణవిముక్తుల్ని చేస్తానని హామీ ఇచ్చానని చెప్పారు.
కోనసీమలో పంట విరామం ప్రకటించారని గుర్తు చేశారు. పెద్ద రైతులకు కూడా ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం తమదే అన్నారు. ఈ ఏడాది 12 టీఎంసీల నీళ్లు హంద్రీనీవా ద్వారా రాయలసీమకు తీసుసు వెళ్లామన్నారు. ఎక్కడైనా 7 గంటల విద్యుత్ రాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
కొందరు కేస్ స్టడీల గురించి చెప్పారని, వివరాలు ఇవ్వడమంటే ఇవ్వడం లేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. రైతుల ఆత్మహత్యల పైన మాట్లాడారు కానీ వివరాలు ఇవ్వలేదన్నారు. ఎర్రచందనం గురించి బెరైటీస్ గురించి ప్రతిపక్షం ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు.

తాను పాదయాత్ర సమయంలో రైతుల ఆవేదన చూశానన్నారు. అందుకే రుణ విముక్తి చేశానని చెప్పారు. రుణమాఫీతో నిజమైన లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు. గత పదేళ్లలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ప్రతిపక్షం వారు చెప్పేవన్నీ అసత్యాలని వారే నిరూపించుకున్నారన్నారు.
ప్రతి పేదవాడికి పింఛన్ ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. గత ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు రుణంలో ఇరుక్కుపోయారన్నారు. 2014 నాటికి లోటు బడ్జెట్, కరెంట్ కోతలు మిగిల్చారని కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. రుణమాఫీకి సంబంధించి ఫేజ్ 2 కూడా ప్రారంభమైందన్నారు. కాగా, అనంతరం శాసన సభ నిరవధిక వాయిదా పడింది.
భజన చేయించుకోవడానికే: శ్రీకాంత్ రెడ్డి
అధికార పక్షం భజన చేయించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శాసన సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద చెప్పారు. ప్రజా సమస్యల పైన చర్చించనందుకు అధికార పార్టీ సిగ్గుపడాలన్నారు. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అన్నారు.












Click it and Unblock the Notifications