ఏపీ బీజేపీ నేతల్ని అదుపు చేయండి: మోడీకి బాబు ఫిర్యాదు, హ్యాపీ
న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారని, వారిని అదుపులో పెట్టాలని, లేదంటే మన రెండు పార్టీలు నష్టపోతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు రాష్ట్ర బీజేపీ నేతల పైన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పరోక్షంగా దగ్గుబాటి పురంధేశ్వరి తదితర నేతలు టిడిపి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పాక టిడిపి నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కేంద్రం నిధులు ఏం చేస్తున్నారని, మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. టిడిపితో దోస్తీకి గుడ్ బై చెప్పే విధంగా రెచ్చిపోయి మాట్లాడారు.

దీనినే చంద్రబాబు ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలను అదుపులో పెట్టాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. లేదంటే టిడిపి, బిజెపి రెండూ నష్టపోతాయని చెప్పారు.
చంద్రబాబు హ్యాపీ!
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు ఆనందంగా కనిపించారు. చర్చలు ఫలవంతంగా ముగిశాయని పార్టీ నేతలకు ఆయన చెప్పారు. దాదాపు తాను ఉంచిన ప్రతిపాదనలన్నింటికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది. చర్చలు ఫలప్రదం అయ్యాయని చెప్పారు.
కాగా, సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ వద్ద 12 అంశాలపై మూడు విభాగాలుగా చర్చించారు. తొలి 50 నిమిషాలు కరువు పైన చర్చించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్రం సాయం, లెక్కలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ నేతల వ్యాఖ్యల పైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications