తుని టీడీపీ అభ్యర్ధి ఖరారు చేసిన చంద్రబాబు ! దివ్యకు టికెట్ - కృష్ణుడికి కీలక పదవి ?
ఏపీలో కీలకమైన తుని అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిపై నెలకొన్న సస్పెన్స్ కు అధినేత చంద్రబాబు ఇవాళ తెరదించారు. యనమల కృష్ణుడు స్ధానంలో రామకృష్ణుడి కుమార్తె దివ్యకు టికెట్ ఖరారు చేశారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ వరుస ఓటముల నేపథ్యంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కబోతోందనే టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ఒకప్పుడు తునిలో వరుస విజయాలు అందుకున్న యనమల రామకృష్ణుడు తన ఓటమి తర్వాత సోదరుడు కృష్ణుడితో పోటీ చేయించినా ఫలితం దక్కలేదు. రెండుసార్లు ఓడిన కృష్ణుడి స్ధానంలో ఈసారి టీడీపీ అభ్యర్ధిగా తన కుమార్తె దివ్యను పోటీ చేయించాలని భావించారు. అయితే దీనికి కృష్ణుడు అంగీకరించకపోవడంతో వివాదం నెలకొంది. దీనిపై ఇవాళ చంద్రబాబుతో కృష్ణుడు భేటీ అయ్యారు.
హైదరాబాద్ కు యనమల కృష్ణుడితో పాటు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు వర్మ, వరుపుల రాజాను పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు తుని టికెట్ పై సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం తుని టీడీపీ టికెట్ ను యనమల కుమార్తె దివ్యకు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో యనమల రామకృష్ణుడు పంతం నెగ్గించుకున్నట్లయింది. అయితే తుని టికెట్ వదులుకుంటున్న యనమల కృష్ణుడికి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.

చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన యనమల కృష్ణుడు.. సోదరుడు రామకృష్ణుడితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో దివ్య గెలుపు కోసం కృషిచేస్తానన్నారు. పార్టీలో తనకు చంద్రబాబు తగిన గుర్తింపు ఇస్తారనే నమ్మకం కూడా ఉందన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని కూడా ఆయన తోసిపుచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న తమ సోదరులు.. భవిష్యత్తులోనూ ఇదే పార్టీలో కొనసాగుతామన్నారు.












Click it and Unblock the Notifications